బంగ్లాగా బెంగాల్ మార‌బోతోందా?

Update: 2022-07-20 13:30 GMT
ప్ర‌స్తుతం వివిధ రాష్ట్రాల్లో న‌గ‌రాల పేర్ల‌ను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు మారుస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌హారాష్ట్ర‌లో ఔరంగాబాద్ పేరును శంభాజీ న‌గ‌ర్ గా, ఉస్మానాబాద్ పేరును ధారా శివ్ గా మార్చిన విష‌యం తెలిసిందే. అంత‌కుముందు ఉత్త‌ర ప్ర‌దేశ్ లో అల‌హాబాద్ పేరును ప్ర‌యాగ రాజ్ గా, మొగ‌ల్ స‌రాయ్ పేరును దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ గా ఆ రాష్ట్ర బీజేపీ ప్ర‌భుత్వం మార్చింది. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ జిల్లా అని ఏపీ ప్ర‌భుత్వం పేరు మార్చింది. ఇలా పలుచోట్ల పేర్ల మార్పిడి ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాల‌ని అక్క‌డి తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేంద్రానికి విన్న‌వించింది. రాష్ట్రాల పేర్లు, న‌గ‌రాల పేర్లు మార్చాలంటే కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. రాష్ట్రాలు పేర్లు మార్చి ఆ సిఫార‌సుల‌ను కేంద్రానికి మాత్ర‌మే పంప‌గ‌ల‌వు. కేంద్రం ఆమోదిస్తేనే వాటి పేర్ల మార్పు అమ‌ల్లోకి వ‌స్తుంది.

ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం కేంద్రానికి నివేదించింది. ఈ విష‌యాన్ని ప్ర‌స్తుత వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా కేంద్ర మంత్రి నిత్యానంద‌రాయ్ ఈ విష‌యాన్ని సభ్యుల‌కు తెలిపారు. ఇది కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని చెప్పారు.

1947లో ఇండియా, పాకిస్థాన్ విడిపోయిన‌ప్పుడు బెంగాల్ ను రెండుగా విభ‌జించి తూర్పు బెంగాల్ ను పాకిస్థాన్ లో క‌లిపారు. తూర్పు బెంగాల్ లో ముస్లింలు అధికం. ఈ నేప‌థ్యంలో మ‌త ప్రాతిప‌దిక‌న తూర్పు బెంగాల్ ను పాకిస్థాన్ కు అప్ప‌గించ‌గా, ప‌శ్చిమ బెంగాల్ ఇండియాలో ఉండిపోయింది.

అయితే 1971లో పాకిస్థాన్ అరాచ‌కాలు పెరిగిపోవ‌డంతో పాకిస్థాన్ పై సైనిక చ‌ర్య చేప‌ట్టిన ఇందిరాగాంధీ తూర్పు బెంగాల్ ను కొత్త దేశం.. బంగ్లాదేశ్ గా ఏర్ప‌డేలా చేశారు. దీంతో తూర్పు బెంగాల్.. పాకిస్థాన్ నుంచి విడిపోయి కొత్త‌దేశంగా ఏర్ప‌డింది.

అయితే అప్ప‌టి నుంచి భార‌త‌దేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్ మాత్రం అదే పేరుతో కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో దాని పేరు మార్చాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి గ‌త కొంత‌కాలంగా కోరుతూ వ‌స్తున్నారు. బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బంగ్లా అనే పేరు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
Tags:    

Similar News