ఇది నిజమే.. మోడీని బెంగాల్ కు రావాలని కోరిన దీదీ

Update: 2019-09-19 06:18 GMT
ఇద్దరు ప్రజాదరణ కలిగిన నేతల మధ్య రాజకీయ శత్రుత్వం పెద్ద విషయం కాదు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకూ ఇలాంటివి కోకొల్లలు చూస్తుంటాం. కానీ.. ఆ ఇద్దరు నేతలు అత్యున్నత స్థాయిలో ఉండటం.. ఇద్దరూ మూర్తీభవించిన మొండితనంతో వ్యవహరించటం ప్రత్యేకతగా చెప్పాలి. ఇంతకూ ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ అయితే.. మరొకరు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడి మీటింగ్ కు ఎన్ని ఆటంకాలు కల్పించాలో అన్ని కల్పించటమే కాదు.. ప్రధాని తన పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు బెంగాల్ కు వస్తే చుక్కలు చూపించిన ఘటికురాలు దీదీ. అలాంటి ఆమె.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ప్రధాని మోడీతో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.

 తమ మధ్య జరిగిన సమావేశం మొత్తం ఒక రాష్ట్రానికి.. కేంద్రానికి మధ్య జరిగిన భేటీనే తప్పించి మరేమీ లేదని తేల్చేశారు. నిరుద్యోగంతో సహా పలు అంశాలపై తామిద్దరం చర్చించినట్లుగా చెప్పిన మమత.. ప్రధానిని కలిసిన సందర్బంగా ఆయనకు పసుపుపచ్చ గులాబీలతో కూడిన బొకేను అందించారు. రాజకీయంగా చూస్తే.. ఎవరైనా ప్రముఖుల్ని కలిసినప్పుడు రెడ్.. ఆరెంజ్.. పింక్ కలర్ లో ఉండే గులాబీ బొకేల్ని ఇవ్వటం కనిపిస్తుంది.

కొన్ని సందర్భాల్లోనే వైట్ కలర్ గులాబీ బొకేను ఇస్తుంటారు. దీనికి భిన్నంగా ఎల్లో కలర్ గులాబీల్ని ఇవ్వటం విశేషం. ఇక.. తమ రాష్ట్రానికి ఉన్న పేరును బంగ్లాగా మార్చాలన్న వినతిని పరిశీలించాల్సిందిగా కోరారు. రాష్ట్రం పేరు మార్పుపై కేంద్రం వద్ద సలహాలు.. సూచనలు ఉంటే ఇవ్వాలని వాటిని తాము స్వాగతిస్తామని చెప్పటం ద్వారా.. మోడీతో తాను గొడవ పెట్టుకోవాలన్న ఆలోచనతో లేదన్న విషయాన్ని ఆమె స్పష్టం చేశారని చెప్పాలి. అంతేకాదు.. దసరా తర్వాత తమ రాష్ట్రంలోని బిర్భూమ్ జిల్లాలో రూ.12వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును ఆవిష్కరించేందుకు రావాలని స్వయంగా ఆహ్వానించటం గమనార్హం.

ఎప్పటిలానే అందరు ముఖ్యమంత్రుల మాదిరే.. ప్రధానితో భేటీ బాగా జరిగిందని.. తమ వినతుల విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించినట్లుగా మమత చెప్పారు. ఏమైనా.. ఉప్పునిప్పులా ఉంటే నేతల ఇద్దరి మధ్య సమావేశం సానుకూల వాతావరణంలో సాగటం ఒక విశేషమైతే.. మోడీతో భేటీపైనా.. తాను ప్రస్తావించిన వివిధ అంశాలపై ఆయన రియాక్ట్ అయిన తీరుపై దీదీ సంతోషాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.


Tags:    

Similar News