జాబు కోసం బాల‌య్య ఇలాకాలో ఆత్మ‌హ‌త్య

Update: 2017-10-12 14:10 GMT
``బాబు వ‌స్తే...జాబు వ‌స్తుంది`` 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ ఊద‌ర‌గొట్టేసిన నినాదం ఇది. సైకిల్ పార్టీ గెలుపులో ఈ ప్ర‌చారం బాగానే ఉప‌యోగప‌డింద‌ని, త‌మ గెలుపున‌కు దోహ‌ద‌ప‌డింద‌ని ఆ పార్టీ నేత‌లు కూడా చెప్పుకుంటుంటారు. కానీ ఆ హామీ నిలుపుకోవ‌డంలో టీడీపీ వైప‌ల్యం చెందిందనే టాక్ ఉంది. రాజకీయ వ‌ర్గాల్లో కూడా ఈ చ‌ర్చ జోరుగా వినిపిస్తుంది. నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నిస్పృహ‌లు అలుముకున్నాయ‌ని విప‌క్షాలు - విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. అయితే ఈ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌న్న‌ట్లుగా... తాజాగా ఓ నిరుద్యోగి ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం చోట చేసుకుంది.

తాజాగా తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ త‌న‌యుడు - టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ నిరుద్యోగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఉద్యోగం రాక‌పోవ‌డం వ‌ల్లే త‌ను త‌నువు చాలిస్తున్న‌ట్లు ఆయ‌న తుది శ్వాస విడిచే స‌మ‌యంలో రాసిన లేఖ‌లో పేర్కొన్నాడు. ''అమ్మా - నాన్నా - అవ్వ - తాత నన్ను క్షమించండి - నేను ఉద్యోగం సంపాదించలేక పోయాను. నాకు జీవితంపై విరక్తి వచ్చింది.. ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నారు.. మీకు తెలియకుండా వెళ్లిపోతున్నందుకు క్షమించండి.. నా చావుకు కారణం ఉద్యోగం రాకపోవడమే'' అంటూ లేఖ రాసి ఈ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మ‌హ‌త్య ఉదంతంపై పోలీసుల కథనం ప్రకారం..హిందూపురం దశరథ రామయ్య కాలనీలో నివాసముంటున్న వడ్డె ఆదినారాయణప్ప పరిగి తహశీల్దార్‌ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హిందూపురంలోని ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు వడ్డె నవీన్‌(23)ను లక్షల రూపాయలు ఖర్చు చేసి బీటెక్‌ చదివించారు. ఈ మధ్యనే వేల రూపాయలు కట్టి అనంతపురంలోని ఓ బ్యాంకు కోచింగ్‌ సెంటరులో చేర్పించారు. సెలవుల నిమిత్తం రెండ్రోజుల క్రితం ఇంటికొచ్చాడు. బుధవారం తెల్లవారుజామున అనంతపురానికి కోచింగ్‌ కోసం వెళ్లాల్సి ఉంది.  అయితే  ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన నవీన్‌ తెల్లవారు జామున పైగదిలో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు నిరుద్యోగమే కారణమంటూ సుసైడ్‌ లెటర్‌ రాశాడు. టూ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుత్రికి తరలించారు.

కాగా, తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా ఉన్న హిందూపురంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌, ఆయ‌న త‌న‌యులైన హ‌రికృష్ణ‌ - బాల‌కృష్ణ‌ల‌ను గెలిపించ‌డం ద్వారా హిందూపురం కాస్త నంద‌మూరి పురంగా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందిన చోటే...ఓ నిరుద్యోగి కొలువు కోసం క‌ల్లు కాయలు కాసేలా చూసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News