న‌డిరోడ్డు మీద వెంటాడి మ‌రీ న‌రికేశారు

Update: 2018-09-27 03:54 GMT
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మ‌రో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బుధ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల ప్రాంతంలో ర‌ద్దీగా ఉన్న హైద‌రగూడ‌-అత్తాపూర్ ర‌హ‌దారి మీద ఒక వ్య‌క్తిని ఇద్ద‌రు వ్య‌క్తులు వెంటాడి.. వేటాడి మ‌రి హ‌త్య చేశారు. అది కూడా.. అత్యంత పాశ‌వికంగా కావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

వేలాదిమంది చూస్తుండ‌గా.. ఎవ‌రిని లెక్క చేయ‌కుండా.. కొంద‌రు సాహ‌సికులు వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా.. తాము అనుకున్న పనిని పూర్ది చేసే క్ర‌మంలో ఎవ‌రినీ లెక్క చేయ‌కుండా అడ్డొచ్చిన వారిని విడిపించుకొని మ‌రీ హ‌త్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతంలో పోలీసులు క‌ళ్లెదుటే ఉన్నా.. బాధితుడ్ని కాపాడే విష‌యంలో చేతులెత్తేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ లు పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తాము అనుకున్న‌ట్లుగా చంపేసిన అనంత‌రం పోలీసుల‌కు లొంగిపోయిన తీరు.. పాశ‌వికంగా గొడ్డ‌లితో అదే ప‌నిగా న‌రికేయ‌టం.. త‌ర్వాత పెద్ద పెద్ద‌గా తాము అనుకున్న ప‌నిని పూర్తి చేశామంటూ నినాదాలు చేయ‌టం చూసిన సామాన్యుల‌కు నోట మాట రాలేదు. ప‌క్క‌నే ఉన్న పోలీసులు సైతం సామాన్యుల మాదిరి వ్య‌వ‌హ‌రిస్తూ.. ఆచితూచి అన్న‌ట్లుగా ఉన్న తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇంత‌కీ ఇంత దారుణంగా ఎందుకు హ‌త్య చేసిన‌ట్లు?  దాని వెనుక అస‌లు కార‌ణం ఏమిటి? అన్న‌ది చూస్తే.. ఈ హ‌త్య ప్ర‌తీకారం తీర్చుకోవ‌టానికి చేసింది కావ‌టం గ‌మ‌నార్హం. త‌న కొడుకును హ‌త్య చేసినోడ్ని రోడ్డు మీద చంపేయ‌టం ఒక ఎత్తు అయితే.. హ‌త్య అనంత‌రం.. తాను చేయాల్సిన ప‌నిని పూర్తి చేశాన‌న్న‌ట్లు విజ‌య‌గ‌ర్వంతో గాల్లో చేతులు ఊపుకుంటూ పోలీసుల ముందుకు రావ‌టం.

ఈ హ‌త్య‌కు డిసెంబ‌రులో న‌గ‌రంలో జ‌రిగిన మ‌రో హ‌త్య‌తో లింకు ఉంది. న‌గ‌రంలోని జుమ్మేరాత్ బ‌జార్.. ధూల్ పేట్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల ర‌మేశ్ గౌడ్.. మ‌హేశ్ గౌడ్ లు ప్రాణ స్నేహితులు. అయితే.. అదే ప్రాంతానికి చెందిన ఒక మ‌హిళ‌తో ర‌మేశ్ కు వివాహేత‌ర సంబంధం ఉంది. ఆమె పైన మ‌హేశ్ కూడా క‌న్నేశాడు. ఆమెను వేధించాడు. దీంతో.. ఆ విష‌యాన్ని ఆమె ర‌మేశ్‌ కు చెప్పింది. దీంతో రంగంలోకి దిగి మ‌హేశ్ ను అంతం చేయాల‌ని భావించాడు.

గ‌త ఏడాది కొంద‌రు స్నేహితుల‌తో క‌లిసి మైసిగండిలో పార్టీ అని చెప్పి అక్క‌డ‌కు తీసుకెళ్లి మ‌హేశ్ చేత బాగా తాగించి.. కారులో హ‌త్య చేశారు. అనంత‌రం శంషాబాద్ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ముచ్చింత‌ల్ గ్రామానికి తీసుకెళ్లి మృత‌దేహాన్ని ప‌డేసి.. నిప్పు అంటించారు. అనంత‌రం కారును శంషాబాద్‌ కు తీసుకొచ్చి స‌ర్వీసింగ్‌ కు ఇచ్చారు. అయితే.. కారులో ర‌క్తం ఉండ‌టాన్ని గుర్తించిన షాపు య‌జ‌మాని.. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. దీంతో ర‌మేశ్ తో పాటు మ‌రో ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వ‌చ్చిన అత‌డు.. బుధ‌వారం ఉద‌యం కోర్టు విచార‌ణ‌కు వెళ్లి వ‌స్తున్న‌ప్పడు మాటు వేసిన మ‌హేశ్ తండ్రి.. ఆయ‌న బావ‌మ‌రిది క‌లిసి వెంటాడి మ‌రీ హ‌త్య చేశారు.

త‌న కొడుకును హ‌త్య చేసిన వైనాన్ని జీర్ణించుకోలేద‌ని మ‌హేశ్ తండ్రి కిష‌న్ ర‌మేశ్ పై క‌క్ష పెంచుకున్నాడు. మ‌హేశ్ మేన‌మామ‌.. త‌న బావ‌మ‌రిది సాయంతో ర‌మేశ్ ను చంపాల‌ని నిర్ణ‌యించుకొని గ‌త కొంత‌కాలంగా అత‌డి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా కోర్టుకు వ‌స్తున్నాడ‌న్న విష‌యాన్ని తెలుసుకొని చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

త‌న‌ను హ‌త్య చేసేందుకు వెంటాడుతున్న మ‌హేశ్ తండ్రిని చూసిన ర‌మేశ్ ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీశాడు. రోడ్డు మీద క‌నిపించిన కానిస్టేబుల్‌ ను సాయం కోరాడు. స‌ద‌రు కానిస్టేబుల్ ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. అదే స‌మ‌యంలో.. ముగ్గురు సామాన్యులు ప్రాణాల‌కు తెగించి మ‌రీ హ‌త్య‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ.. వారి ప్ర‌య‌త్నాల్ని వ‌మ్ము చేస్తూ.. చేతిలో ఉన్న గొడ్డ‌లితో భ‌య‌పెడుతూ.. ర‌మేశ్ ను న‌డి రోడ్డు మీద అత్యంత కిరాత‌కంగా హ‌త‌మార్చారు. మూడు నిమిషాల‌పాటు సాగిన హైడ్రామాలో దాదాపు 20 సార్లు గొడ్డ‌లితో వేట్లు వేయ‌టం క‌నిపించింది. ఈ హ‌త్య‌ను అక్క‌డి స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించ‌టంతో హ‌త్య ఎంత దారుణంగా చేశార‌న్న‌ది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా కనిపించింది. ఈ హ‌త్య ఉదంతం నగ‌రానికి షాకింగ్ గా మారింది. ఇటీవ‌ల కాలంలో జ‌రిగిన హ‌త్య‌లు.. హ‌త్యాయ‌త్నాలు (మిర్యాల‌గూడ‌.. గోకుల్ థియేట‌ర్‌.. తాజా ఉదంతం) మూడింటిలోనూ తండ్రే హ‌త్య‌కు ప్లాన్ చేయ‌టం గ‌మ‌నార్హం.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News