ఆదివాసి బిడ్డ.. అదరగొట్టింది!

Update: 2020-09-15 23:30 GMT
వేలకువేల ఫీజులు లేవు.. ఎయిర్​ కండీషన్​ గదులు లేవు.. కోచింగ్​ ఇచ్చే నిపుణులైన మాస్టార్లు లేరు.. నిరుపేదలైన తల్లిదండ్రులు.. ఉండేది పూరిగుడిసెలో.. ఇటువంటి సవాళ్ల మధ్యే ఓ ఆదివాసీ బాలిక జేఈఈ మెయిన్స్​లో సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక జేఈఈ జాయింట్​ ఎంట్రన్స్​ ఎగ్జామినేషన్​ మెయిన్స్​లో 88.11 శాతం మార్కులు సాధించింది.

మంచిర్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన మమత జేఈఈలో సత్తాచాటింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వారు నిరక్షరాస్యులైనప్పటికి కూతురిని ప్రోత్సహించారు. గిరిజన సంక్షేమ హాస్టల్​లో ఆమెను చేర్పించారు. అక్కడ మమతా బాగా చదువుతుండటంతో అధ్యాపకులు కూడా ప్రోత్సహించారు.

గత నాలుగు నెలలుగా కరోనా కారణంగా కళాశాల బంద్​ అయ్యింది. అయినప్పటికీ ఆన్​లైన్​ క్లాసులు కొనసాగుతున్నాయి. అయితే మమత వద్ద స్మార్ట్​ఫోన్​ లేదు. దీంతో సొంతంగానే ప్రిపేర్​ అయ్యింది. కళాశాలలో అధ్యాపకులు ఇచ్చిన నోట్స్​.. ఇతరత్రా మెటీరియల్​తో ప్రిపేర్​ అయ్యింది. చివరకు 88.11 శాతం మార్కులు సాధించింది. అయితే తాను 90 శాతం మార్కులు వస్తాయనుకున్నానని మమత కొంచెం నిరాశ వెలిబుచ్చింది. ఇన్ని సవాళ్లమధ్య విద్యనభ్యసించిన మమత ఈ ఘనత సాధించడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆమెను అభినందించారు. తన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్టు మమత చెప్పింది.
Tags:    

Similar News