ఏపీ అసెంబ్లీకి పాదయాత్ర.. మందక్రిష్ణ డిసైడ్

Update: 2019-07-19 07:50 GMT
ఎస్సీ వర్గీకరణ అంశం మారోమారు ఏపీ అసెంబ్లీలో చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఏపీ సీఎంగా జగన్ ఇటీవల ఫిరాయింపులను ప్రోత్సహించకుండా బాగా పాలిస్తున్నారంటూ స్వయానా ప్రశంసించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణ ఇప్పుడు తన దాకా వచ్చేసరికి మాత్రం మాటమార్చేశారు. జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాదిగలకు అన్యాయం.. మాలలకు జగన్ న్యాయం చేస్తున్నాడని దీన్ని ఖండిస్తున్నామన్నారు..

ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు తీరును తప్పుపట్టారు. మాల మాదిగల మధ్య చంద్రబాబు వర్గీకరణ చిచ్చు పెట్టాడని ధ్వజమెత్తారు. ఉన్న వాస్తవాన్ని చెప్పిన జగన్ పై మందక్రిష్ణ మాత్రం తన కొంపలు మునిగిపోయినట్టు విమర్శలు కురిపించడం విశేషం. ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ చాలా క్లియర్ గా అందరికీ న్యాయం చేస్తామని హామీఇచ్చారు. అయితే జగన్ ముఖ్యమంత్రిలా కాదు.. మాల మహానాడు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడని మందక్రిష్ణ ఫైర్ అయ్యారు.

అయితే అంతేకాదు.. జగన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని శనివారం గుంటూరు నుంచి ఏపీ అసెంబ్లీకి పాదయాత్రకు ప్లాన్ చేశారు. జగన్ మేనమామలు మాలలు అయినంత మాత్రానా సామాజిక న్యాయానికి అడ్డుపడాలా అని ప్రశ్నించారు.

అయితే మందక్రిష్ణ వ్యాఖ్యలపై మాల మహానాడు  జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ దుయ్యబట్టారు. మందక్రిష్ణ పాదయాత్రను అడ్డుకుంటామన్నారు. నాడు వైఎస్, నేడు జగన్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. అందరికీ న్యాయం జరగడాన్ని మందక్రిష్ణ తట్టుకోవడం లేదన్నారు.  ఇలా మాల, మాదిగ వివాదం అసెంబ్లీలోనే కాదు.. ఆ రెండు వర్గాల మధ్య కూడా వివాదానికి కారణమైంది.

    
    
    

Tags:    

Similar News