కారెక్క‌నున్న మ‌రో టీడీపీ సీనియ‌ర్

Update: 2018-01-11 14:04 GMT
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ సెకండ్ ఫేజ్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జోరుగా కొన‌సాగిస్తున్నారా? నల్గొండ జిల్లా ఆపరేషన్ ఆకర్ష్ అనంతరం నిజామాబాద్ జిల్లా మీద దృష్టి పెట్టారా? త‌్వ‌ర‌లో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఒక‌రు కారెక్క‌నున్నారా? ఇందుకు సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సారథ్యం వహిస్తున్నారా? అనే ప్రశ్నలకు అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్దన్న పాత్ర పోషించిన డీఎస్ కారెక్కిన వెంట‌నే క్యాబినెట్ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. అనంత‌రం రాజ్యసభ సభ్యుడిగా అవ‌కాశం కూడా పొందారు. ఈ నేప‌థ్యంలో మిగ‌తా నేత‌ల చూపు సైతం టీఆర్ఎస్ వైపు మ‌ళ్లింద‌ని అంటున్నారు. సీనియర్ నాయకుడు - టీడీపీకి చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా కారెక్కుతారన్న ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ జిల్లా ఎంపీగా ఉన్న సీఎం కేసీఆర్ కూతురు కవిత ఈ ఆప‌రేష‌న్‌ కు శ్రీ‌కారం చుట్టి కీలకంగా వ్యవహరిస్తున‌ట్లు స‌మాచారం. జిల్లాలో కీలకమైన రెడ్డి - క‌మ్మ‌ సామాజికవర్గాల‌ను టీఆర్ ఎస్ పార్టీలో మరింత బలోపేతం చేసే దిశగా ఆమె సమాలోచనలు చేస్తున్నట్లు చెప్తున్నారు. తెలంగాణ‌లో బ‌తికి బ‌ట్ట‌లేని టీఆర్ ఎస్‌ లో ఉండ‌టం ఎందుక‌ని మండ‌వ‌ను కారెక్కించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం.ఈ మేర‌కు ప్రాథ‌మిక చ‌ర్చ‌లు కూడా పూర్త‌యిన‌ట్లుగా తెలుస్తోంది.

సీనియ‌ర్ నాయ‌కుడిగా పేరున్న మండవ వెంకటేశ్వర్‌ రావు మంచి వ్యూహకర్తగా పేరుంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేశారు. గతంలో ఒంటిచేత్తో జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ఘనత ఆయన సొంతం. అయితే 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఆయన రాజకీయంగా క్రియాశీలంగా లేరు. అప్పటి నుంచి ఏ రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనటం లేదు. ఇప్ప‌టికే జిల్లాపై సంస్థాగతంగా పట్టుసాధించిన టీఆర్‌ ఎస్‌ రాబోయే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి ఎదురు లేకుండా చూసుకునేందుకుగానూ మండవపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే మండవతో సమాలోచనలు జరిపినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

సంక్రాంతి పండ‌గ త‌ర్వాత మండ‌వ చేరిక ఉంటుంద‌ని...టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. టీడీపీలకి భ‌విష్య‌త్ లేద‌ని భావించిన ఆయా పార్టీల నేత‌లు టీఆర్ ఎస్‌ లో చేరుతున్న రూపంలోనే ఈ చేరిక ఉంటుంద‌ని స‌మాచారం.
Tags:    

Similar News