వామ్మో!..గాంధీ ఫ్యామిలీలో ఎవ‌రూ త‌గ్గ‌ట్లేదే!

Update: 2019-05-12 17:13 GMT
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు భార‌త ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే హాటెస్ట్ గానే కాకుండా హీటెస్ట్ ఎన్నిక‌లుగానూ రికార్డు సృష్టిస్తాయేమో. ఓ వైపు అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్థాయికి దిగ‌జారి మాట్లాడుతుంటే... తామేమీ త‌క్కువ తిన‌లేదంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా మోదీకి ధీటుగానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. స‌రే... వైరి వర్గాల మ‌ధ్య మాట‌ల తూటాలు ఓకేగానీ... ఈ సారి ఎందుకో గానీ... గాంధీ ఫ్యామిలీకి చెందిన వారంతా వ‌రుస‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌ గా నిలుస్తున్నార‌ని చెప్పాలి. రాహుల్ గాంధీ.. చౌకీదార్ చోర్ హై అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి పెను క‌ల‌క‌ల‌మే రేపారు. ఆ త‌ర్వాత ఆయ‌న చిన్నాన్న కుమారుడు - బీజేపీ సుల్తాన్ పూర్ సిట్టింగ్ ఎంపీ - ప్రస్తుతం ఫిలిబిత్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న వ‌రుణ్ గాంధీ కూడా త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌న సృష్టించారు. ప్ర‌త్యర్ధులతో షూ లేస్ క‌ట్టించుకుంటానంటూ వ‌రుణ్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌ల‌మే రేపాయి.

ఈ వ్యాఖ్య‌ల‌ను మ‌రిచిపోక ముందే... వ‌రుణ్ త‌ల్లి - ఎన్న‌డూ వివాదాల జోలికి పోని ఫిలిబిత్ సిట్టింగ్ ఎంపీ - ప్ర‌స్తుతం సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేన‌కా గాంధీ కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సుల్తాన్‌ పూర్ లో త‌న ప్ర‌త్య‌ర్థి. బీఎస్పీ అభ్య‌ర్థి చంద్ర భ‌ద్ర సింగ్ కు వేలు చూపించి మ‌రీ గ‌ట్టి వార్నింగిచ్చేశారు. పోలింగ్ జ‌రుగుతున్న వేళ‌.... ఇలా మేన‌క ప్ర‌త్య‌ర్థికి వార్నింగివ్వ‌డం పెను సంచ‌ల‌నంగానే మారిపోయింది. అయినా అక్క‌డ ఏం జ‌రిగింద‌న్న విష‌యానికి వస్తే... సుల్తాన్‌ పూర్ లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద సింగ్ మద్దతుదారులు ఓటర్లను బెదిరిస్తున్నారంటూ మేనక దృష్టికి రావడంతో వెంటనే ఆమె అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా వేలు చూపిస్తూ చంద్ర భద్ర సింగ్ కు వార్నింగ్ ఇచ్చారు. మీ రౌడీయిజం ఇక్కడ చూపించవద్దంటూ హెచ్చరించారు. రౌడీల్లా బెదిరిస్తే ఓట్లు పడవు అంటూ స్పష్టం చేశారు. దీనికి చంద్ర భద్ర సింగ్ బదులిస్తూ - తానేమీ రౌడీయిజం చేయట్లేదని - బీజేపీ నేతల తీరే సరిగాలేదంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు రాత్రివేళ డబ్బు పంచారని - అడ్డుకున్న తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బీఎస్పీ కార్యకర్తలు చంద్ర భద్ర సింగ్ కు అనుకూలంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి అండతో చంద్ర భద్ర సింగ్ రెచ్చిపోతున్నారని ఈ సందర్భంగా మేనకా గాంధీ ఆరోపణలు చేసి మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.
Tags:    

Similar News