మోడీకి కౌంట‌ర్ ఇస్తూనే..మ‌న్మోహ‌న్ దొరికిపోయారా?

Update: 2017-12-11 14:19 GMT
ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్‌ లో ఎన్నిక‌ల వేడి మ‌రింత పెరుగుతోంది. వాదోప‌వాదాలు.. విమ‌ర్శ‌లు - ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో అధికార బీజేపీ - ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఈ ర‌చ్చ‌ను మ‌రింత పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే...గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు పాకిస్థాన్ అధికారులతో చర్చించినట్లు ప్రధాని మోడీ చేసిన ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ఆ అంశంపై ఆయన ఇవాళ ఓ లేఖను విడుదల చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రధాని మోడీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మన్మోహన్ విమర్శించారు. ఓటమి భయంతోనే ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని మాజీ ప్రధాని అన్నారు.

ప్ర‌ధాని మోడీ చేసిన ఆరోపణలు తనను ఎంతగానో బాధించాయని, గుజరాత్‌ లో విక్టరీ కోసం నోటికి వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని మన్మోహన్ అన్నారు. తన అధికార దాహాన్ని తీర్చుకునేందుకు రాజ్యాంగబద్ధమైన కార్యాలయాలను అన్యాయంగా నిందిస్తున్నారని మన్మోహన్ సింగ్ విమర్శించారు. `జాతీయ భావంపై కాంగ్రెస్ పార్టీని అనుమానించాల్సిన అవసరం లేదు - ప్రధాని మోడీ ఆహ్వానం లేకుండానే పాకిస్థాన్‌ కు ఎందుకు వెళ్లారు. పఠాన్‌ కోట్ ఎయిర్‌ బేస్‌ కు ఎందుకు పాకిస్థాన్ ఐఎస్‌ ఐ ఏజెంట్లను రమ్మన్నారో ఆయనే చెప్పాలి` అని మన్మోహన్ నిలదీశారు. గత అయిదు దశాబ్ధాలుగా తన ట్రాక్ రికార్డు అందరికీ తెలుసన్నారు. అయ్యర్ ఇంట్లో జరిగిన విందు కార్యక్రమంలో గుజరాత్ ఎన్నికల గురించి ఎవరితోనూ మాట్లాడలేద‌ని, విందుకు హాజరైన ఎవరు కూడా గుజరాత్ ఎన్నికల గురించి చర్చించలేదన్నారు. కేవలం ఇండోపాక్ సంబంధాల గురించి మాత్రమే చర్చించామన్నారు. ప్రధాని కార్యాలయ హుందాతనాన్ని కాపాడేందుకు ప్రధాని మోడీ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతారని ఆశిస్తున్నట్లు మన్మోహన్ ఓ లేఖలో పేర్కొన్నారు.

అయితే...ఇలా ప్ర‌శ్నించే స‌మ‌యంలోనే మ‌న్మోహ‌న్ సొంత పార్టీని ఇర‌కాటంలో పెట్టేశారా అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌నోమ‌హ‌న్ ఈ విష‌యాన్ని అంగీక‌రించిన వెంట‌నే బీజేపీ రంగంలోకి దిగింది. స‌మావేశం జ‌రిగింది నిజ‌మే అని అంగీకరిస్తున్న‌పుడు బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ప‌నిచేసిన మ‌న్మోహ‌న్ వంటి వారు ఆ స‌మాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. విదేశాంగ శాఖ‌కు ఎందుకు స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌ లో ప‌డిన‌ట్ల‌యింది.

కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆదివారం పాలన్పూర్‌ లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ `కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాక్ అధికారులతో భేటీ అయ్యారు. దీనికి పాక్ హైకమిషనర్ - పాక్ మాజీ విదేశాంగశాఖ మంత్రి - భారత మాజీ ఉపరాష్ట్రపతి - మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ హాజరయ్యారు. తర్వాతి రోజే అయ్యర్ నన్ను నీచుడు అని అన్నారు. ఇది చాలా గంభీరమైన అంశం దీనిపై ఆ పార్టీ సమాధానం చెప్పాలి` అని మోడీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ ను గుజరాత్ సీఎం చేయాలని పాక్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్ (డీజీ) సర్దార్ అర్షద్ రఫీక్ ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకవైపు గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం.. మరోవైపు పాక్‌ తో కాంగ్రెస్ నేతల భేటీ.. ఆ తర్వాతే గుజరాత్‌ లోని పేదలు - బలహీనవర్గాలను - మోడీని అవమానించడం.. ఈ వరుస ఘటనలపై మీకు అనుమానం రావడం లేదా? అంటూ సభికులను ప్రశ్నించారు. రహస్య సమావేశం గురించి టీవీలు - పత్రికల్లో వచ్చిందన్న ప్రధాని.. వాటి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పేరును ప్రధాని ప్రస్తావించకున్నా.. గాంధీనగర్‌ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మాజీ ఉప రాష్ట్రపతి పేరు చెప్పారు.

దీనిపై ఇప్ప‌టికే కాంగ్రెస్ స్పందించింది. గురుదాస్‌ పూర్ - ఉదయ్‌ పూర్‌ ల్లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాక్‌ లో అప్పటి ఆ దేశ ప్రధాని షరీఫ్ మనుమరాలి పెళ్లికి ఎందుకు వెళ్లారని ప్రధాని మోడీని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌ దీప్ సూర్జెవాలా ప్రశ్నించారు. పాక్ రాయబారి, ఆ దేశ మాజీ మంత్రితో కాంగ్రెస్ నాయకత్వం సమావేశమయ్యారన్న ప్రధాని మోడీ ఆరోపణ నిరాధారమని మీడియాతో అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నార న్నారు. ఉగ్రదాడి జరిగిన పఠాన్‌ కోట్ వైమానిక దళ స్థావరంలోకి పాక్ ఐఎస్‌ ఐ ఎందుకు అనుమతించారని నిలదీశారు.
Tags:    

Similar News