అరే.. మన్మోహన్ ఇలా కూడా మాట్లాడతారా?

Update: 2016-02-14 04:00 GMT
మౌన ప్రధాని అన్న పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి ప్రజాకర్షణ లేకున్నా పదేళ్లు దేశ ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డు ఆయన సొంతం. తనకు తానుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలవలేని ఆయన ఏకంగా పదేళ్లు ప్రధానిగా వ్యవహరించటం మర్చిపోకూడదు. మౌన సింగ్ గా.. సైలెంట్ పీఎంగా ఎవరెన్ని విమర్శలు చేసినా నోరు విప్పేందుకు ఏ మాత్రం ఇష్టపడని మన్మోహన్ తాజాగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మీద మన్మోహన్ ఫైర్ కావటం గమనార్హం. కొన్ని కీలక విషయాల్లో ప్రధాని మోడీ మౌనం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బీఫ్ వివాదంతో పాటు.. దాద్రీ అసహనం లాంటి అంశాల విషయంలో మోడీ మాట్లాడకపోవటం ఏమిటని ప్రశ్నించారు. మోడీ భారత్ కు మాత్రమే ప్రధాని అంటూ ఎక్కడ తగలాలో అక్కడే చురక అంటించిన మన్మోహన్.. దేశ ప్రజల్లో భరోసాను కల్పించటంలో మోడీ సర్కారు విఫలమైందని వ్యాఖ్యానించారు. పవర్ లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచటంలో మోడీ సర్కారు విఫలమైందంటూ ఎద్దేవా చేశారు. మోడీ హయాంలో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గలేదని తప్పు పట్టారు.

తన పదేళ్ల పదవీ కాలంలో ఎప్పటికప్పుడు అన్ని విషయాల మీద ఇదేతరహాలో మన్మోహన్ సింగ్ స్పందించి ఉంటే బాగుండేది. అలాంటిదేమీ లేకుండా మౌనానికి ప్రతిరూపంగా వ్యవహరించిన మన్మోహన్ ఇప్పుడిలా తప్పుపట్టటం విచిత్రమే. అధికారంలో ఉన్నప్పుడు నోరు విప్పని మన్మోహన్.. విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడటం ఏమిటో..?
Tags:    

Similar News