మౌన సింగ్ ‘హోదా’ మీద మాట్లాడారు

Update: 2016-08-05 11:36 GMT
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పెదవి విప్పారు. మౌన ప్రధానిగా.. సైలెంట్ సింగ్ గా పేరున్న ఆయన ఎట్టకేలకు ఏపీ హోదా అంశంపై తాను ప్రధాని హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీల గురించి తాజాగా రాజ్యసభలో ప్రస్తావించారు. ఏపీ విభజన సమయంలో తాను మొత్తం ఆరు హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన మన్మోహన్ సింగ్.. ఆ హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం మీద ఉందన్నారు. తాను ఇచ్చిన హామీల మీద అప్పట్లో అరుణ్ జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. విభజన హామీల్ని నాటి క్యాబినెట్ కూడా ఆమోదించిందని.. ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్రపతిని కోరినట్లుగా చెప్పిన మన్మోహన్.. ఎన్నికల షెడ్యూల్ రావటంతో ఆర్డినెన్స్ ఆగిపోయిందంటూ ఇప్పటివరకూ చర్చకు రాని కొత్త విషయాన్ని ప్రస్తావించారు.

తన మాటలతో ప్రత్యేక హోదా కోసం యూపీఏ సర్కారు చట్టబద్ధత కోసం ప్రయత్నించినా.. అనుకోని విధంగా ఎన్నికల షెడ్యూల్ రావటంతో ఆ ప్రయత్నం పూర్తి కాలేదన్న విషయాన్ని మన్మోహన్ చెప్పినట్లైంది. ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా మీద కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. హోదా అంశంపై పలుమార్లు చర్చించామని.. ఏపీని ఆదుకునేందుకు చిత్తశుద్ధి ఉందన్న ఆయన.. ఆ రాష్ట్రానికి మేలు చేసే మార్గాల్ని పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటికే ఏపీ ఎంపీలతో ప్రధానితో మాట్లాడినట్లు చెప్పిన జైట్లీ.. ప్రతిఒక్కరు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరిస్తామని చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News