మ‌న్మోహ‌న్ జీ... ఇదేం రాజ‌కీయమండీ!

Update: 2017-11-19 07:43 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అందుకేనేమో... గ‌డచిన ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రాభ‌వానికి బ‌దులు తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌న వాణితో బాణీని కూడా పూర్తి స్థాయిలో మార్చిప‌డేశారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు అంశాల‌పై అర్థ‌వంత‌మైన విమ‌ర్శ‌లు గుప్పిస్తూ... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నారు. ఇక రాహుల్‌ కు మ‌ద్ద‌తుగా ఢిల్లీలోని మెజారిటీ మేధావులు కూడా ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా రాహుల్‌ కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ముందుకు వ‌స్తున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్ప‌టికే ప‌దేళ్ల పాటు ప్ర‌ధానిగా ప‌నిచేసిన మ‌న్మోహ‌న్ సింగ్ ఇక మూడో ద‌ఫా తాను ఆ ప‌దివిని మోయ‌లేన‌ని చెప్పి... త‌న ప్లేస్‌ ను రాహుల్‌ కు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అయితే పాల‌న‌లో ఏమాత్రం అనుభవం లేని రాహుల్ ను ప్ర‌ధానిగా ఎలా అంగీక‌రిస్తార‌మ‌నుకున్నారంటూ... మ‌న్మోహ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని దేశ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించేశారు. ఫ‌లితంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీగా జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌ స‌భ‌లో క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదాకు కూడా నోచుకోలేక‌పోయింది.

ఇదంతా గ‌త‌మ‌నుకున్నా... మ‌రోమారు రంగంలోకి దిగేసిన మ‌న్మోహ‌న్ ఈ ద‌ఫా కూడా రాహుల్‌ ను పీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టుగానే క‌నిపిస్తున్నారు. మొన్న‌టిదాకా చాలా సైలెంట్‌ గానే క‌నిపించిన మ‌న్మోహ‌న్‌... ఇటీవ‌లి కాలంలో అడ‌పాద‌డ‌పా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వ‌చ్చిన ప్ర‌తి సారీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారుపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. గ‌తంలో పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ అమ‌లు సంద‌ర్భాల్లో కూడా అంత‌గా బ‌య‌ట‌కు రాని మ‌న్మోహ‌న్ ఇప్పుడు వ‌రుస‌గా ప‌లు కార్యక్ర‌మాల‌కు హాజ‌రువుతుండ‌టం నిజంగానే ప్రాధాన్యం సంత‌రించుకుంద‌నే చెప్పాలి. ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌ర్వాత కేవ‌లం ఢిల్లీకే ప‌రిమిత‌మైపోయిన మ‌న్మోహ‌న్ నిన్న కేర‌ళ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. వామ‌ప‌క్షాల‌తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతున్న క్ర‌మంలోనే మ‌న్మోహ‌న్ ఈ ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా నిన్న కేర‌ళ‌లో మ‌న్మోహ‌న్ ఏం చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నియంతృత్వ ధోర‌ణితో ముందుకు సాగుతోంద‌ని, ఆ నియంతృత్వానికి చ‌ర‌మ గీతం పాడాలంటే వామ‌ప‌క్షాలు కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టు క‌ట్టాల్సిందేన‌ని చెప్పారు.

ఈ ఒక్క వ్యాఖ్య‌తోనే ఆయ‌న వామ‌ప‌క్షాల‌తో మైత్రికి కాంగ్రెస్ ఎంత‌గా ఎదురు చూస్తుంద‌న్న విష‌యాన్ని మ‌న్మోహ‌న్ చెప్ప‌క‌నే చెప్పేశారు. అంత‌టితో ఆగ‌ని మ‌న్మోహ‌న్‌... త‌న‌దైన రాజ‌కీయం ప్ర‌ద‌ర్శించేశారు. కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూడా పాలుపంచుకున్న స‌మావేశంలో వామ‌ప‌క్ష పార్టీ ఆధ్వ‌ర్యంలోని అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేర‌ళ‌లో వామ‌ప‌క్ష పార్టీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల పరిస్థితి క్షీణించింద‌ని మ‌న్మోహ‌న్ వ్యాఖ్యానించారు. దీంతో వేదిక‌పైనే ఉన్న విజ‌య‌న్ షాక్ తిన్నార‌ట‌. అయినా కూడా ఇవేమీ ప‌ట్టించుకోని మ‌న్మోహ‌న్ త‌న‌దైన శైలి ప్ర‌సంగాన్ని కంటిన్యూ చేస్తూ... కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును గ‌ద్దె దించేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాలు కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టు క‌ట్టాల‌ని కోరారు. మ‌రి ఈ త‌ర‌హా విన‌తికి విజ‌య‌న్ అండ్ కో (వామ‌ప‌క్షాలు) ఎలా స్పందిస్తాయో చూడాలి.
Tags:    

Similar News