మన్మోహన్ తో ఆర్థిక మంత్రి సమావేశం..ఏంటి సంగతి?

Update: 2019-06-27 18:06 GMT
తొలి సారి ఆర్థిక శాఖ మంత్రి పదవిని చేపట్టిన నిర్మలా సీతారామన్ మాజీ ప్రధానమంత్రి, ప్రసిద్ధ ఆర్థిక వేత్త మన్ మోహన్ సింగ్ ను కలవడం ఆసక్తిదాయకంగా మారింది. మన్మోహన్ ఇప్పుడు మాజీ ప్రధాని హోదాలో మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ నేతగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఆ పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు.

ఈ క్రమంలో ఆయనతో నిర్మల సమావేశం కావడం ఆసక్తిని రేపుతూ ఉంది. పార్టీలకు అతీతంగా చూసినా మన్ మోహన్ సింగ్ నిస్సందేహంగా మేధావి. ప్రత్యేకించి ఆర్థిక రంగంలో ఆయన చదువు, అనుభం అపారమైనది.

దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ అందించిన సేవలు దేశ ప్రగతికే ఊపునిచ్చాయి. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా సంస్కరణలకు తలుపులు తెరిచిన ఆర్థిక మంత్రిగా మన్ మోహన్ దేశ చరిత్రలో శాశ్వతంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. బీజేపీ వాళ్లు మన్మోహన్ ప్రధానిగగా ఉన్నప్పుడు తీవ్రంగా ఎద్దేవా చేసేవాళ్లు. ఆ తర్వాత కమలం పార్టీ వాళ్లకు అధికారం దక్కినా.. ఆర్థిక శాఖ విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి.

నోట్ల రద్దు, జీఎస్టీల విషయంలో బీజేపీ విమర్శలను ఎదుర్కొనాల్సి వచ్చింది. రూపాయి విలువ పతనం - ఉపాధి కల్పనలో వెనుకబడి పోవడం.. వంటి అంశాలపై బీజేపీ నిందలు భరించాల్సి వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి వెళ్లి మన్ మోహన్ తో కలిశారు.

అది మర్యాద పూర్వకమైన భేటీనే అని ప్రభుత్వం అంటోంది. ఎలాగూ త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో మన్మోహన్ సూచనలను సలహాలను నిర్మల తీసుకోవడంలో తప్పేం లేదు కూడా. పార్టీ ఏదైనా మన్ మోహన్ అనుభవాన్ని వాడుకోవాల్సిన అవసరం దేశానికి ఉండనే ఉంటుంది.
Tags:    

Similar News