ఎటు చూసినా డెడ్‌లైన్ల మాటే

Update: 2021-11-14 10:39 GMT
రాజ‌కీయాల్లో ట్రెండ్ ఎప్ప‌టిక‌ప్పుడూ మారుతూనే ఉంటుంది. ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా నాయ‌కులు ఎప్ప‌టిక‌ప్పుడూ త‌మ పంథా మారుస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడేమో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డెడ్‌లైన్ల మాట ఎక్కువ‌గా వినిపిస్తోంది. అధికారంలో ఉన్న నాయ‌కులు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చాలంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు డెడ్‌లైన్లు పెడుతున్నారు. మ‌రోవైపు ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా స‌ర్కారుకు డెడ్‌లైన్ పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటీవ‌ల ఈ డెడ్‌లైన్ల ఒర‌వ‌డికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రీకారం చుట్టార‌నే చెప్పొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న కార్మికుల‌కు మ‌ద్దతుగా ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే.  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ దిశ‌గా వేగంగా సాగుతున్న కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును వ‌దిలేసి ప‌వ‌న్ రాష్ట్రంలోని వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌డ్డారు. వారంలో రోజుల్లోపు విశాఖ ఉక్కుపై కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించాల‌ని అఖిల ప‌క్షాన్ని ఏర్పాటు చేయాల‌నే డిమాండ్‌తో వైసీపీ ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ పెడుతున్న‌ట్లు ప‌వ‌న్ ప్ర‌కటించారు. కానీ ఆ డెడ్‌లైన్‌ను అస‌లు ప‌ట్టించుకోని వైసీపీ స్పందించ‌నే లేదు. ఇప్ప‌టికే ఈ గ‌డువు ముగిసింది కానీ ప‌వ‌న్ మ‌ళ్లీ ఏం మాట్లాడ‌టం లేదు. మ‌రోవైపు ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేసేందుకు విడుద‌ల చేసిన జీవోను ఉప‌సంహ‌రించుకోవ‌డానికి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌.. వైసీపీకి వారం డెడ్‌లైన్ విధించారు. మ‌రోవైపు ప్ర‌భుత్వం త‌గ్గేదే లేద‌ని తెగేసి చెప్పింది.

ఇక పీఆర్సీ జాప్యంపై జ‌గ‌న్ స‌ర్కారుపై మండిప‌డుతున్న ఉద్యోగ సంఘాలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ నెలాఖ‌రు వ‌ర‌కు వేత‌న స‌వ‌ర‌ణ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్ర‌భుత్వానికి నెల‌ఖారు వ‌ర‌కు డెడ్‌లైన్ పెట్టాయి. ఆ త‌ర్వాత పోరుబాట ప‌డ‌తామ‌ని హెచ్చ‌రించాయి. మ‌రోవైపు ఇటు తెలంగాణ‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల సీఎం కేసీఆర్‌కు తాజాగా డెడ్‌లైన్ విధించారు. ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కోనుగోలు చేయాల‌నే డిమాండ్‌తో ఆమె 72 గంట‌ల రైతు వేద‌న దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ దీక్ష సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మూడు వారాల్లోగా ధాన్యం పూర్తిగా కొనాల‌ని లేదంటే తాను ఆమ‌ర‌ణ దీక్ష చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇలా ప్ర‌భుత్వాల‌కు డెడ్‌లైన్లు విధించ‌డం బాగానే ఉంది కానీ.. దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డ‌మే గ‌మ‌నార్హం.
Tags:    

Similar News