యూఎస్‌ లో రెడ్డి..క‌మ్మ మ‌ధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌

Update: 2017-04-14 04:11 GMT
మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మ‌ర్కండేయ క‌ట్జూ గురించి తెలీని వారు ఉండ‌రు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం.. ఓపెన్ గా మాట్లాడ‌తాన‌ని చెబుతూ.. విష‌యం ఏదైనా స‌రే షాక్ ఇచ్చేలా మాట్లాడ‌టం ఆయ‌న‌కో అల‌వాటు. తాజాగా ఆయ‌నో ట్వీట్ చేశారు. కాస్త ఆల‌స్యంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఉపాధి కోసం.. మంచి కెరీర్ కోసం అమెరికాకు వెళ్లే వారు.. అక్క‌డికెళ్లిన ప‌ని వ‌దిలేసి.. కుల‌త‌త్వంతో ఎంత‌లా కొట్టుకు చ‌స్తున్నారో తెలుసా? అంటూ ఉదాహ‌ర‌ణ చూపించి మ‌రీ విమ‌ర్శ‌లు చేశారు.

అమెరికాలో కొద్ది రోజుల క్రితం రెడ్డి వ‌ర్సెస్ క‌మ్మ టీమ్స్ మ‌ధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జ‌రిగింద‌ని చెప్పిన ఆయ‌న‌.. దానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. ఫ్రెండ్లీ మ్యాచ్ కాసేపు బాగానే జ‌రిగింద‌ని.. ఏదో చిన్న విష‌యం మీద ఘ‌ర్ష‌ణ మొద‌లైంద‌ని.. అది కాస్తా ముదిరి.. చివ‌ర‌కు మ్యాచ్ ర‌ద్దు చేసుకొని వెళ్లిపోయార‌ని చెప్పుకొచ్చారు.

ఈ ఉదంతాన్ని వెల్ల‌డిస్తూ.. గ‌తంలో తాను 90 శాతం మంది ఇండియ‌న్స్ ను ఫూల్స్ గా చెప్పాన‌ని.. అది క‌రెక్టేన‌ని చెప్పేందుకు తాజా ఉదంత‌మే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అమెరికాలో కూడా వీళ్ల‌కు కుల‌మేనా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. కులాల వారీగా క్రికెట్ ఆడ‌ట‌మా? అందులోనూ గొడ‌వ ప‌డ‌ట‌మా? అంటూ విస్మ‌యాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. వేలాది కిలోమీట‌ర్లు వెళ్లిన త‌ర్వాత కూడా కులాలే వీళ్ల‌కు ప్ర‌ధాన‌మైందే అని తిట్టిపోశారు. అగ్ర‌రాజ్యంలో బ‌తుకుతూ.. ఇలా కులాల మ‌ధ్య క్రికెట్ మ్యాచ్ గురించి విని షాక్ తిన్నాన‌ని.. గ‌తంలో తాను అన్న‌ట్లు 90శాతం మంది ఇండియ‌న్స్ ఫూల్స్ అన‌టం క‌రెక్టేన‌న్న భావ‌న క‌లుగుతుంద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News