కరోనా కలకలం నేపథ్యంలో కేరళలో పెళ్లిళ్లు వాయిదా వేసుకోమంటున్నారు

Update: 2020-02-01 04:30 GMT
పెళ్లిళ్లు చేసుకోవాలో? వద్దో? కూడా ప్రభుత్వం చెబుతుందా? అన్న ప్రశ్న మదిలో మెదలొచ్చు కానీ.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సూచన కూడా మంచిదేనని చెప్పక తప్పదు. చైనాను వణికిస్తున్న కరోనావైరస్ కు సంబంధించిన తొలి కేసు కేరళ లో బయట కు వచ్చిన సంగతి తెలిసిందే. చైనా నుంచి వచ్చిన ఒకరిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించటం తో ప్రత్యేకమైన ఐసోలేటెడ్ వార్డులో చేర్చి.. ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు.

కేరళలో కరోనా వైరస్ కేసు బయట పడటంతో కేరళ సర్కారు ముందస్తు జాగ్రత్తల్లోకి దిగింది. వైరస్ ప్రభావం ఉందని అనుమానిస్తున్న ప్రాంతాల్లో పెళ్లిళ్లు.. పెద్ద ఎత్తున వేడుకలు లాంటివి వాయిదా వేసుకోవాలని సలహా ఇస్తోంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఒకచోటుకు చేరితే..ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుందన్న ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వం చేస్తున్న సూచన ప్రజల్ని భయపెట్టే కన్నా.. ముందస్తు జాగ్రత్త లో భాగంగా తీసుకుంటున్నదిగా రాష్ట్ర మంత్రి కేకే శైలజ స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అత్యవసరమైతే తప్పించి బయటకు రాకూడదన్న సలహా ఇస్తున్నారు. ఉద్యోగాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సదరు మంత్రి.. సవాలుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రాణాంతక వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా.. ముందస్తు జాగ్రత్తతో కేరళ ప్రభుత్వం చేస్తున్న సూచనలు సరైనవేనని చెప్పక తప్పదు.


Tags:    

Similar News