లండ‌న్ అపార్ట్ మెంట్లో..శంషాబాద్ హోట‌ల్లో ఫైర్ యాక్సిడెంట్‌

Update: 2017-06-14 05:23 GMT
నిజానికి రెండు సంఘ‌ట‌న‌ల‌కు సంబంధం లేదు. కానీ.. కొద్ది గంట‌ల తేడాతో రెండు ప్ర‌ముఖ న‌గ‌రాల్లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్ర‌మాదాలు క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి. లండ‌న్ లోని 27 అంత‌స్తుల అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకోగా.. హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్ లోని ఒక హోట‌ల్లో పెను అగ్నిప్ర‌మాదం చోటు చేసుకోవ‌టం క‌ల‌క‌లాన్ని రేపింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యానికి రెండింటిలోనూ ప‌లువురు ఉండ‌టం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.
ఇటీవ‌ల ఐసిస్ ఉగ్ర‌వాదుల దాడుల‌తో త‌ర‌చూ ఉలిక్కి ప‌డుతున్న లండ‌న్ మ‌హాన‌గ‌రంలోని ప‌శ్చిమ  ప్రాంతానికి చెందిన లాన్ క‌స్ట‌ర్ వెస్ట్ ఎస్టేట్ లోని లాటిమ‌ర్ రోడ్డు లోని 27 అంత‌స్తుల అపార్ట్ మెంట్‌ లో ఈ రోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

ఈ 27 అంత‌స్తుల అపార్ట్ మెంట్‌ లో మొత్తం 120 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో ఎంత మంది ఉన్నార‌న్న స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. మంట‌ల్ని అదుపులోకి తెచ్చేందుకు 40 అగ్నిమాప‌క శ‌క‌టాలు.. 200 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి ప్ర‌ధ‌మ చికిత్స అందిస్తున్నారు. ఈ భారీ అగ్నిప్ర‌మాదంతో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నం మొత్తంగా కాలిపోయింద‌ని.. ఏం మిగ‌ల్లేద‌ని చెబుతున్నారు.

భ‌వ‌నం మొత్తం బూడిద కుప్ప‌లా మారిన‌ట్లుగా ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు. భారీ అగ్ని ప్ర‌మాదం కార‌ణంగా భ‌వ‌నం మొత్తం త‌గ‌ల‌బ‌డిపోయింద‌ని.. ఏమీ మిగ‌ల్లేద‌ని తెలుస్తోంది. భ‌వ‌నం మొత్తం పొగ క‌మ్మిపోయింద‌ని.. మ‌రికాసేప‌ట్లో కుప్ప‌కూలిపోవ‌టానికి సిద్ధంగా ఉన్న‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ఈ భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు. పోలీసులు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ అగ్నిప్ర‌మాదానికి కార‌ణం ఏమిట‌న్న విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

ఇదిలా ఉండ‌గా.. హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్ లో బ‌హుళ అంత‌స్తుల లాడ్జి (శ్రీ అనుప‌మ రెసిడెన్సీ లాడ్జి) లో ఈ తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. 8 అంత‌స్తుల్లో ఉన్న ఈ భ‌వ‌నంలో సుమారు 50 మంది చిక్కుకుపోయారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్పందించిన అగ్నిమాప‌క సిబ్బందితో 28 మందిని ర‌క్షించారు. భ‌వ‌నంలో చిక్కుకుపోయిన మిగిలిన వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ భ‌వ‌నంలోని మూడో అంత‌స్తులో ఉన్న ఈఎస్ ఐ ఆసుప‌త్రి పూర్తిగా ద‌గ్థ‌మైంది. మంట‌ల్ని అదుపు చేసేందుకు అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే మంట‌లు చెల‌రేగి ఉంటాయ‌ని అనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News