గీతకు ప్రచారంపై పాక్ డైలీ ఉక్రోషం

Update: 2015-10-29 04:16 GMT
భారతదేశం నుంచి పొరపాటున పాకిస్తాన్ వెళ్లి ఇంతకాలం అక్కడే చిక్కుబడి తిరిగొచ్చిన మాటలు రాని గీత విషయంలో ఎందుకింత ప్రచారం జరుగుతోందని పాక్ దినపత్రిక ‘ది నేషన్’ ప్రశ్నించింది. గీత వ్యవహారం మరుగునపడటానికి ఎంతో సమయం పట్టదని, తర్వాత మనం మళ్లీ మనవైన విషపూరిత ఆలోచనల్లోకి వెళ్లిపోతామని ది నేషన్ వ్యాఖ్యానించింది. గీత వీడ్కోలు పలుకుతోంది అనే శీర్షికతో రూపొందిన పాక్ పత్రిక సంపాదకీయం 12 ఏళ్ల క్రితం అనూహ్యంగా పాక్ భూభాగంలోకి వచ్చిన భారత బాలిక గీతకు ఇంత ప్రచారం రావడానికి భజరంగ్ బాయిజాన్ సినిమాయే కారణమని పేర్కొంది. ఆ సినిమా ప్రభావంతోనే గీతను తిరిగి భారత్‌కు తీసుకురావలన్న డిమాండ్ తీవ్ర రూపం దాల్చిందని ది నేషన్ పేర్కొంది.

అయితే ఆమెను అటు పాకిస్తాన్ ఇటు భారత్ రెండూ మర్చిపోవడానికి, ఆమె అనామకురాలిగా మిగిలిపోవడానికి ఎంతో కాలం పట్టదని పాక్ పత్రిక వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లుగా పాక్‌ లో ఆమెను సంరక్షించిన ఈదీ పౌండేషన్ భారత ప్రధాని మోదీ ప్రకటించిన కోటిరూపాయల విరాళాన్ని తీసుకోరాదని నిర్ణయించుకోవడం పాక్ భద్రతా వ్యవస్థకు అనుకోని ప్రయోజనం కలిగిస్తుందేమో కానీ, ఈదీ ఫౌండేషన్ నిర్ణయం సైతం తీవ్ర చర్చకు దారితీసి పాకిస్తాన్ వెర్సెస్ భారత్‌ గా అభిప్రాయాలను వర్గీకరిస్తుందనిది నేషన్ తెలిపింది.

అయితే గీతను క్షేమంగా స్వదేశానికి పంపిన పాకిస్తాన్ పట్ల భారత్‌ లో కనిపిస్తున్న సానుకూల హృదయ స్పందనలు తాత్కాలికమేనని పాక్ పత్రిక పెదవి విరిచింది. తన ఇమేజిని అంతర్జాతీయంగా సానుకూలం చేసుకోవడానికే భారత ప్రధాని మోదీ ఈ రకమైన ఎత్తుగడలు పన్నుతున్నారేమో అని సందేహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గీతను అందరూ మర్చిపోవడానికి ఎక్కువ కాలం పట్టదని త్వరలోనే మనమంతా మనవైన విషపూరిత ఆలోచనల్లోకి వెళ్లిపోతామని ది నేషన్ వ్యాఖ్యానించింది.

సానుకూలంగా స్పందించినందుకు మోడీ ఆడుతున్నది డ్రామా ఏమో అంటూ విషబీజాలు నాటడానికి ప్రయత్నిస్తున్న ఈ పాక్ పత్రిక.. మనం విషపూరిత ఆలోచనల్లోకి వెళ్లిపోతాం అనడం నిజమే కావొచ్చు. కానీ అందుకు పాకిస్తాన్ తొలి బాధ్యత వహించాల్సి ఉంటుందని.. విషం వెదజల్లడం అనేది అక్కడినుంచే జరుగుతున్నదని కూడా గుర్తిస్తుందో లేదో.
Tags:    

Similar News