మన పద్దతిలో ఆసీస్‌ స్టార్‌ పెళ్లి!

Update: 2022-02-15 04:13 GMT
ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌ మన్ గ్లెన్‌ మాక్స్‌ వెల్‌ సుదీర్ఘ కాలంగా ఎన్నారై యువతి విని రామన్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి ఎంగేజ్‌ మెంట్‌ జరిగి రెండేళ్లు అయ్యింది. 2020 సంవత్సరంలో వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. పెళ్లిని వివిధ కారణాల వల్ల వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 27న విని రామన్ మెడలో మాక్స్ వెల్‌ మూడు ముళ్లు వేయబోతున్నాడు.

అదేంటి మాక్స్ వెల్‌ మూడు ముళ్లు ఎలా వేస్తాడు అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటే మాక్స్ వెల్‌ తన వివాహాన్ని ఆస్ట్రేలియన్ క్రిస్టియన్‌ సాంప్రదాయంలో కాకుండా తమిళ హిందూ సాంప్రదాయం పద్దతిలో చేసుకోబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తమిళ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ఏర్పాట్లు చేయడం మాత్రమే కాకుండా తమిళంలో వివాహ ఆహ్వాన శుభలేఖ అచ్చు వేయించారు.

తమిళనాడు కుటుంబానికి చెందిన విని రామన్ ను వారి పద్దతిలోనే పెళ్లి చేసుకోవాలని మాక్స్ వెల్‌ భావించాడు. హిందూ సాంప్రదాయం పై అభిమానం మరియు గౌరవంతో పాటు అమ్మాయి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ విధంగా పెళ్లికి సిద్దం అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. మాక్స్ వెల్ ఇలాంటి తరహా పెళ్లికి సిద్దం అవ్వడంను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. మాక్స్ వెల్‌ పెళ్లి కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తన విద్వంసకర బ్యాటింగ్‌ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న మాక్స్ వెల్‌ వివాహం విభిన్నంగా జరుగబోతుంది అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అది మన సాంప్రదాయ పద్దతిలో జరుగుతుండటంతో ఇండియన్‌ అభిమానులు మరింత ఎక్కువ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వీరి వివాహ ఆహ్వాన పత్రిక మరియు విని రామన్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
Tags:    

Similar News