ఉస్మానియా వార్తల్ని కవర్ చేయటం లేదా?

Update: 2016-06-03 17:07 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా జరిగే ఏ వ్యవహారాన్ని మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదా? ఆయన సర్కారును ఇబ్బంది పెట్టే ఏ వార్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్ లో ఏమైనా జరిగితే చాలు టీవీ చానళ్లు పోలోమని వెళ్లేవి. వరుసగా క్యూ కట్టేవి. ఉస్మానియా క్యాంపస్ లో జరిగే చిన్న ఆందోళన సైతం టాప్ న్యూస్ లో ఒకటిగా ఉండేది. అక్కడే జరిగే వ్యవహారాలపై అప్ డేటెడ్ గా న్యూస్ ఇచ్చేవాళ్లు.

ఒక విధంగా చెప్పాలంటే నాటి ఉమ్మడి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నా.. ఉస్మానియాకు ఇచ్చినంత ప్రాధాన్యత మరే వర్సిటీకి మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పాలి. ఉస్మానియా మాదిరి ఉద్యమాలు చాలానే వర్సిటీల్లో జరిగినా మీడియా పెద్దగా కవర్ చేయలేదన్న విమర్శ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పురిటిగడ్డ అయిన ఉస్మానియా క్యాంపస్ లో జరిగే ఆందోళనకు అంత పెద్దపీట వేసిన మీడియా.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇదే విషయం మీద ఉస్మానియా విద్యార్థులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిన్నటికి నిన్న క్యాంపస్ లో జనజాతరను విద్యార్థి జేఏసీ చేపట్టింది. దీనికి తెలంగాణ ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. హైకోర్టు అనుమతి లేని ఈ సభ నిర్వహణ విషయంలో పెద్ద డ్రామానే చోటు చేసుకుంది. ఒకదశలో పోలీసులు.. విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రికత్త నెలకొన్నా ఒకట్రెండు ఛానళ్లలో ఈ వ్యవహారం మీద బ్రేకింగ్ న్యూస్ అంటూ తళుక్కున మెరిసి మాయమయ్యాయే తప్పించి.. దీనికి సంబంధించిన వార్తే బులిటెన్లలో రాని పరిస్థితి.

అదే.. ఉద్యమం సమయంలో అయితే.. అదే ప్రధానాంశంగా మారటమే కాదు.. ఓబీ వ్యాన్లు క్యాంపస్ చుట్టూ బారులు తీరి హైటెన్షన్ ను క్రియేట్ చేసేవి. ఉస్మానియా క్యాంపస్ లో సభల నిర్వహణకు కోర్టులు అనుమతి మీద హైటెన్షన్ నెలకొనేది. కానీ.. అలాంటివేమీ లేకుండా అసలు ఉస్మానియా క్యాంపస్ లో ఏం జరగనట్లుగా మీడియా వ్యవహరించిందన్న వాదనలు ఉన్నాయి. కొద్దిగో గొప్పో కొన్ని వెబ్ సైట్లు మాత్రమే ఉస్మానియా ఇష్యూను కవర్ చేశాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా వర్సిటీ ప్రాధాన్యత ఎందుకు తగ్గింది? అక్కడ చోటు చేసుకునే ఆందోళన విషయంలో మీడియా ఎందుకని ఫోకస్ చేయటం లేదు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరి.. దీనికి సమాధానం చెప్పే వారెవరు..?
Tags:    

Similar News