విప‌క్షానికి చాన్స్ దొరికింది కాబ‌ట్టే ఆమె ఎంట్రీ

Update: 2017-08-01 05:22 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్లా నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌రిణామాలు అధికార పార్టీకి ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి. స్థానిక ఇసుక వ్యాపారుల తీరు ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకుంది. గ‌త కొద్దికాలంగా అధికార పార్టీని ఇర‌కాటంలో ప‌డేసే అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేత‌లు బాధితుల్లో ద‌ళితులు ఉండ‌టాన్ని ఆస‌రాగా చేసుకున్నారు. తాజాగా ఈ నిర‌స‌న‌ను మ‌రింత  ముందుకు తీసుకుపోతున్నారు. ఏకంగా లోక్‌ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ప‌ర్య‌ట‌న‌తో ఇర‌కాటంలో ప‌డేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రా జన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ళ ఇసుక లారీల దగ్ధం ఘటనలో అరెస్టయి కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బాధితులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి మీరాకుమార్‌ పరామర్శించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మీరాకుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇసుక మాఫియా కోసమేనా? అని ప్రశ్నించారు.

ఇసుక లారీలకున్న విలువ తెలంగాణలో మనుషులకు లేకపోవటం ప్రభుత్వ పాలనాతీరుకు నిదర్శనమని మీరాకుమార్‌ విమర్శించారు. ఇసుక మాఫియాను నియంత్రించాలని డిమాండ్ చేశారు.ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ, ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్న తెరాస సర్కారు తీరు సిగ్గుచేటని, దశాబ్దాల తరబడి తెలంగాణలో అణిచివేతకు గురవుతున్న బడుగు, బలహీనవర్గాలు, దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీ ఆకాంక్షలను తెరాస ప్రభుత్వం తుంచేస్తోందని  ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన తెరాస ఇప్పుడు అదే ఉద్యమాన్ని పెట్టుబడిగా పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలను దండుకుంటోందని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే అక్రమ రవాణా జరుగుతోందనడానికి నేరెళ్ళ సంఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఆదర్శవంతమైన రాష్ట్రంగా, దళితులపై దాడులు లేని ప్రాంతంగా తెలంగాణ మారుతుందని కలలు కంటే, ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక యువకులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, కరెంట్ షాక్‌ తో కోలుకోలేని విధంగా చేశారని ఆరోపించారు. దళితుల ఓట్లతో గెలిచి వారిపైనే దాడులు చేయటం సిగ్గుచేటన్నారు.

ప్రభుత్వ అండతోనే పోలీసులు రెచ్చిపోతున్నారని, దళితులపై జరిగిన దాడులకు నిరసనగా సభ జరుపుకునేందుకు కూడా అనుమతులివ్వకపోవడం తెలంగాణలో కొనసాగుతున్న అణచివేతకు దర్పణం పడుతోందని మీరాకుమార్ అన్నారు. నేరెళ్ళ సంఘటన జాతీయ స్థాయిలో చర్చకు తెరతీసినా, కేంద్ర - రాష్ట్ర మంత్రులు ఇప్పటివరకు రాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సంఘటనకు బాధ్యులైన పోలీసులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించి చర్చ లేవనెత్తుతామని, బాధితులకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ ముందుండి పోరాడుతుందని మీరాకుమార్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News