హిందూ రామ్ వైఎస్ గురించి చెప్పలేదా మేకపాటి?

Update: 2016-06-15 09:46 GMT
రాజకీయ నాయకులు అన్నాక ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం.. ఆరోపణాస్త్రాల్ని సంధించుకోవటం కామన్. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవు. కానీ.. ఈ విమర్శల్లో వేరే రంగానికి చెందిన ప్రముఖల పేర్లను ఉటంకించటం.. వారి పేర్లను తమ వాదనకు అనుగుణంగా చెప్పుకోవటంలోనే అసలు ఇబ్బంది అంతా. తాజాగా ఇలాంటి మాటల్నే చెప్పుకొచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత .. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్ అయ్యే అంశంలో కాస్త వ్యంగ్యాన్ని జోడించి.. బాబు గొప్ప మేధావి అంటూ.. కాకపోతే మోసం చేసే విషయంలో అంటూ ఎటకారం చేసేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసే విషయంలో ప్రపంచ దేశాలు సైతం చంద్రబాబు చర్యల్ని సమర్థించటం లేదని వెరైటీగా వ్యాఖ్యానించారు. అంతలోనే ప్రముఖ జర్నలిస్ట్ ‘హిందూ రామ్’ తో తాను కలిసినప్పుడు బాబు ఎమ్మెల్యేల్ని తీసుకునే విషయం చర్చకు వచ్చిందని.. ఆయన సైతం ఇదంతా తప్పని వ్యాఖ్యానించారన్నారు.

ఎమ్మెల్యేల్ని తమ పార్టీలోకి చేర్చుకునే విషయంలో చంద్రబాబు పాత్రను రామ్ తప్పు పట్టి ఉంటే.. మరి.. ఇలాంటి విధానాన్ని ఒక రేంజ్ లో చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆయన ప్రస్తావించలేదా? అన్నది ఒక ప్రశ్న. జర్నలిస్ట్ అనే వ్యక్తి ఎవరైనా.. ఏదైనా అంశాన్ని ప్రస్తావించినప్పుడు వర్తమానం గురించి మాత్రమే మాట్లాడరు.. భూత.. భవిష్యత్ ల గురించి కూడా చర్చిస్తారు. కానీ.. మేకపాటి వారి విషయాన్నే చూస్తే.. వర్తమానాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్న ఆయన గతంలో వైఎస్.. ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ చేపట్టిన ఆపరేషన్  ఆకర్ష్ గురించి మాట్లాడకుండా ఉండి ఉంటారా..? మేకపాటి వారి నోటి నుంచి ఆ ముచ్చట్లు కూడా వచ్చేస్తే ఎంత బాగుండు..?
Tags:    

Similar News