ఈ జూన్ 2.. హైదరాబాదీయులకు సో స్పెషల్?

Update: 2017-03-05 07:42 GMT
అన్ని అనుకున్నట్లు సాగితే.. ఈ జూన్ 2 హైదరాబాదీయులకు సో.. సో.. స్పెషల్ డేగా మారనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవంగా తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటేవేళ.. హైదరాబాదీయులకు మరింత సంతోషాన్నిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ట్రాఫిక్ నరకం నుంచి తప్పించుకునేందుకు.. నగరజీవి జీవితాలు మరింత వేగంగా మారేందుకు వీలున్న మెట్రో రైల్ పట్టాల మీదకు రావటమేకాదు.. ప్రయాణికుల్ని ఎక్కించుకోనున్నట్లుగా తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం అయితే.. ఇప్పటికే మెట్రో ప్రాజెక్టులో ఒక దశ అయినా పూర్తి అయి.. మెట్రోరైల్ పరుగులు తీస్తూ ఉండాలి. కానీ..ప్రాజెక్ట్ ఆలస్యం కావటంతో అనుకున్నట్లుగా సాగలేదు. ఇప్పటికే పూర్తిగా సన్నద్ధమైన మియాపూర్ – ఎస్ ఆర్ నగర్ మధ్యనున్న 11.90 కిలో మీటర్ల దూరానికి మెట్రో సౌకర్యం జూన్ 2 నుంచి నగర ప్రజలకుఅందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా డేట్ ఫిక్స్ చేయనప్పటికీ.. ఇప్పటికి మరో మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో.. జూన్ 2న మెట్రో రైల్ నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లుగా చెబుతున్నారు.

అదే సమయంలో నాగోల్ నుంచి బేగంపేట వరకూ ఉన్న 16 కిలోమీటర్ల దూరాన్ని తర్వాతి ఫేజ్ లో స్టార్ చేస్తారని.. అది దసరా నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే దసరా పండక్కి నాగోల్ – బేగంపేట మధ్య మార్గాన్ని షురూ చేసే వీలుందని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా సాగితే.. ఈ ఏడాది చివరి నాటికి మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ మధ్యనున్న 29 కిలోమీటర్ల కు మెట్రో రైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చే వీలుందని చెబుతున్నారు. తర్వాతి దశలోనాగోల్ నుంచి హైటెక్ సిటీకి మధ్యనున్న 27 కిలోమీటర్ల దూరం మధ్య కూడా మెట్రో రైలు పరుగులు తీయటం ఖాయమంటున్నారు. ట్రాఫిక్ కష్టాలతో కిందామీదా పడే నగర జీవులకు ఈ వర్షాకాలం నుంచి కొంతమేర మంచిరోజులు స్టార్ట్ అవుతున్నట్లేనని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News