కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు?

Update: 2019-06-09 05:15 GMT
మధ్యంతర ఎన్నికలు - ఉప ఎన్నికలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు రానున్నట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన విధానసభ ఎన్నికల్లో హంగ్ వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే రెండు పార్టీల మధ్య సయోధ్య లేకపోవడంతో ఎన్నికలకు వెళ్తారని తెలుస్తోంది. కానీ బీజేపీ మాత్రం మధ్యంతర ఎన్నికలు అవసరం లేదు.. అతి పెద్ద పార్టీ అవతరించిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో కాంగ్రెస్ - జేడీఎస్ నేతల మధ్య మరింత దూరం పెరిగింది. ఫలితంగా ప్రభుత్వం కూలడం ఖాయమని తెలుస్తోంది. కాగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు మిత్రపక్షాల నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈక్రమంలో సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ మాత్రం ఇటీవల మండ్యలో పార్టీ కార్యకర్తల సమావేశంలో.. ‘ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. ఈ మాటలు వైరల్ అయ్యాయి. ఈక్రమంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేత యడ్డూరప్ప మాత్రం ఎన్నికలు అవసరం లేదని.. సంకీర్ణ ప్రభుత్వం దిగిపోతే బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి సువర్ణ పాలన అందిస్తామని చెబుతున్నారు.

 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి చావుదెబ్బ తిన్నంది. ఈక్రమంలో సంకీర్ణ ప్రభుత్వం మరిన్ని ఇబ్బందుల్లో పడింది. కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలకు గానూ బీజేపీ 25 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ ప్రభంజనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు - జేడీఎస్ అధినేత దేవెగౌడ సైతం ఓటమి చవిచూశారు. తన కుమారుడు నిఖిల్ను రంగంలోకి దింపిన సీఎం కుమారస్వామికి కూడా పరాభవమే ఎదురైంది. ఫలితంగా కాంగ్రెస్ - జేడీఎస్ మధ్య సమన్వయ లోపంతోనే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయామని రెండు పార్టీల నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్› - జేడీఎస్ నేతలు కలిసి పని చేసి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవని భావిస్తున్నారు. ఈ క్రమంలో విభేదాలు తారస్థాయికి చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

 సీఎం తనయుడు నిఖిల్ కుమారస్వామి మండ్య జిల్లా ప్రజలతో వారం రోజుల క్రితం సమావేశమై ఎన్నికలకు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. ఈ వాయిస్ రికారడు రాష్ట్రంలో చర్చనీయంగా మారింది. ఈమేరకు సోషల్ మీడియాలో నిఖిల్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు. సిద్ధంగా ఉండండి. వాటి కోసం ఇప్పటి నుంచే మనం కసరత్తు మొదలుపెట్టాలి. అలసత్వం పనికి రాదు. వచ్చే నెల నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. ఏడాది లోపే లేదా మరో రెండు, మూడేళ్ల తర్వాత ఎన్నికలు రావొచ్చు. జేడీఎస్ కార్యకర్తలంతా ఇందుకు సన్నద్ధంగా ఉండాలి’ అని నిఖిల్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియోను సునీల్ గౌడ అనే కార్యకర్త వాట్సాప్లో షేర్ చేశారు. ఫలితంగా రాజకీయంగా చర్చనీయంగా మారింది.

 పార్టీ కార్యకర్తలు సమాజ సేవకు సిద్ధం కావాలి. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ గెలుపు కోసం గట్టి పోరాటం చేయాలని నిఖిల్ కుమారస్వామి చెప్పారని సీఎం కుమారస్వామి తెలిపారు. మధ్యంతర ఎన్నికల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి ఢోకా లేకుండా ఐదేళ్ల పాటు కొనసాగుతుందన్నారు.

కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగితే తమకేమీ అభ్యంతరం లేదని మాజీ సీఎం యడ్డూరప్ప అన్నారు. అయితే మధ్యంతర ఎన్నికలకు వెళ్తామంటే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ – జేడీఎస్ నేతలకు పాలించడం చేత కాకుంటే తమకు అప్పజెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతృత్వంలో సువర్ణ పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యంతర ఎన్నికలకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పతనం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.
Tags:    

Similar News