ఎంఐఎం దేశంలో ఇన్ని పార్టీల‌ను వ‌ణికిస్తోందా ?

Update: 2021-10-02 00:30 GMT
ఎంఐఎం హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీ కేంద్రంగా నాలుగు ద‌శాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ పార్టీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రానికి పాకుతూ వ‌స్తోంది. ఇంకా చెప్పాలంటే ఎంఐఎం ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల అసెంబ్లీలో ప్రాథినిత్యం ద‌క్కించుకుంది. ఎప్పుడూ హైద‌రాబాద్ లోక్‌స‌భ సీటుతో స‌రిపెట్టుకునే ఈ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్ ఎంపీ స్థానం కూడా త‌న ఖాతాలో వేసుకుంది. బిహార్ - మ‌హారాష్ట్ర లాంటి చోట్ల పాగా వేసిన ఈ పార్టీ బెంగాల్లోనూ ఓట్ల ప‌రంగా మెరుగుప‌డింది. ఇక ఇప్పుడు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న యూపీ ఎన్నిక‌ల్లోనూ ఈ పార్టీ మిగిలిన పార్టీల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

యూపీలో చాలా జిల్లాల‌లో ముస్లింల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ఇప్పుడు అక్క‌డ ఎంఐఎం పోటీ చేస్తే.. ముస్లింట ఓట్లు చీలిపోతే ఏ పార్టీకి న‌ష్టం అన్నదానిపై ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాల అంచ‌నాలు వేసుకుంటున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముస్లింలు సైతం బీజేపీకి ఓట్లేయ‌డంతో బీజేపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇక ఇప్ప‌టికే ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ సైతం త‌మ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో యూపీలో 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తుంద‌ని ప్ర‌కటించారు. రాష్ట్ర జ‌నాభాలో జాట్స్ లాంటి వారు త‌క్కువ శాతంలో ఉన్నా వారికి కూడా ప్ర‌త్యేకించి ఆర్ఎల్‌డీ లాంటి పార్టీలు ఉన్నాయి.

కానీ యూపీ జ‌నాభాలో 19 శాతం ఉన్న ముస్లింల‌కు మాత్రం ప్ర‌త్యేక‌మైన పార్టీ లేదు. అక్క‌డ గ‌ట్టి నేత‌లు కూడా లేరు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఎంఐఎంతోనే ముస్లింల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అస‌ద్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మోడీ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న అయోధ్య నుంచే త‌న పాద‌యాత్ర ప్రారంభిస్తున్నారు. అస‌ద్‌పై న‌మ్మ‌కంతో ప‌లు ముస్లిం సంఘాలు, ముస్లిం నేత‌లు ఆయ‌న వెంట వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అస‌ద్ అక్క‌డ బ‌ల‌ప‌డితే త‌మ‌కు ఎక్క‌డ ముప్పు వాటిల్లుతుందో అని ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ బాగా ఇబ్బందులు పడుతున్నాయి.

ఎందుకంటే ముస్లిం ఓట్లు ముందు నుంచి కూడా ఈ మూడు పార్టీల‌కే ఎక్కువుగా ప‌డుతున్నాయి. అయితే అనూహ్యంగా గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో వీరు కూడా బీజేపీ వైపే మొగ్గారు. దీంతో ఇప్పుడు ఆ వ‌ర్గం సాంప్ర‌దాయ ఓటు బ్యాంకుపై ఆశ‌లు పెట్టుకున్న పార్టీలు ఎంఐఎం దెబ్బ‌కు వ‌ణికిపోతున్నాయి. మ‌రి ఎంఐఎం దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీ అసెంబ్లీలో పాగా వేస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి.




Tags:    

Similar News