తెదేపా కటీఫ్ ప్రకటన.. అంతలోనే తడబాటు!

Update: 2018-02-15 16:51 GMT
భాజపాతో కటీఫ్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక ఫైనల్ డెసిషన్ కు వచ్చేసిందా? మార్చి 5 వ తారీఖునే అందుకు ముహూర్తంగా నిర్ణయించిందా? జగన్ తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానని.. ఏప్రిల్ 6 డెడ్ లైన్ పెట్టగా.. తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రకటన లేకుండానే మార్చి 5న కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి, భాజపాతో కటీఫ్ ప్రకటన చేసేసి.. వ్యూహాత్మకంగా పైచేయి సాధించాలని చూస్తున్నదా? అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీ నాయకుల మాటల కారణంగా వ్యక్తం అవుతున్నాయి.  తెదేపా సర్కారులో మంత్రి.. ఆదినారాయణ రెడ్డి ఈ విషయాన్ని తేదీతో సహా ప్రకటించేసి.. కేవలం కొద్ది వ్యవధిలోనే.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొంటూ మీడియా వారందరికీ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు.

కడపజిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. మార్చి 5వ తేదీ వరకు మాత్రమే రాష్ట్రానికి చేసే మేలు విషయంలో కేంద్రం స్పందన కోసం తాము ఎదురుచూస్తాం అని వెల్లడించారు. ఆలోగా ఏ సంగతి తేలకపోతే.. పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే రోజునే తమ పార్టీ కేంద్రమంత్రులు రాజీనాలు చేస్తారని ఆయన వెల్లడించారు. ఎన్డీయే నుంచి తెదేపా వైదొలుగుతుందని కూడా ఆయన వెల్లడించారు.

చాలా కీలకమైన ప్రకటన కావడంతో.. ఆదినారాయణరెడ్డి ఈ మాటలు అన్నవెంటనే టీవీ ఛానెళ్ల ద్వారా వైరల్ గా ప్రజాబాహుళ్యంలోకి వార్త స్ప్రెడ్ అయింది. గంటకూడా గడవక ముందే.. ఆదినారాయణ రెడ్డి తన వ్యాఖ్యలను దిద్దుకునే ప్రయత్నం చేశారు. అవి కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం సీక్రెట్ గా ఉంచి, ఈ నిర్ణయాన్ని హటాత్తుగా ప్రకటించడం ద్వారా రాజకీయంగా అప్పర్ హేండ్ సాధించాలని అనుకుంటే మంత్రి ఆదినారాయణరెడ్డి దూకుడు ప్రకటనతో వారి వ్యూహం కాస్తా మంటగలిసిపోయినట్టుగా విశ్లేషకులు  భావిస్తున్నారు. తెదేపా రాజీనామాలు చేసేవరకు నమ్మకం లేదని, ముందే ఇలా ప్రకటనలు చేసి.. తర్వాత చేయకపోతే ఉన్న పరువు కూడా పోతుందనే ఆలోచన కూడా వారిలో ఉండవచ్చునని కొందరు  భావిస్తున్నారు.

Tags:    

Similar News