విశాఖ రాజధాని.. మంత్రి అమర్‌ నాథ్‌ హాట్‌ కామెంట్స్‌

Update: 2023-03-21 13:11 GMT
జూలైలో విశాఖ రాజధానిగా పరిపాలిస్తానని ఏపీ సీఎం జగన్‌ ఇప్పటికే ప్రకటించారు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ రాజధాని విషయంలో తమ అభిప్రాయం ఏమీ మారదని వైసీపీ మంత్రులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో విశాఖకు రాజధాని తరలింపుపై మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విశాఖ ఎప్పుడు వస్తారో డేట్‌ ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్‌ – కెన్యా మ్యాచ్‌తో మంత్రి పోల్చడం విశేషం. కెన్యా గెలిచినట్టు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటామని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ఒక సెక్టార్‌కు సంబంధించిన ఎన్నికలు మాత్రమేనని అమర్‌ నాథ్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం రెండు శాతం వర్గానికి సంబంధించినవి మాత్రమేనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు రాజధానులకు రెఫరెండమని తాము అనలేదని అమర్‌ నాథ్‌ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్‌ అని కూడా అనలేదన్నారు.  

టీడీపీ అధికారంలోకి వచ్చాక స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కుంభకోణానికి శ్రీకారం చుట్టారని అమర్‌ నాథ్‌ ఆరోపించారు. నారా వారిదే స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కాం అని అన్నారు. దేశంలో ఇదే అతి పెద్ద స్కాం అని తెలిపారు. ఈ విషయం ప్రజలకు తెలియాలన్నారు.

తండ్రి కొడుకులు (చంద్రబాబు, లోకేష్‌) అవినీతికి పాల్పడ్డారని.. అవినీతిలో నోబెల్‌ ప్రైజ్‌.. నటనలో ఆస్కార్‌ ప్రైజ్‌ వారికి ఇవ్వాలని అమర్‌ నాథ్‌ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో డిజైన్‌ టెక్‌ అనే కంపెనీ నుంచి షెల్‌ కంపెనీలకు డబ్బులు మళ్లించారని ఆరోపించారు. సింగపూర్‌కు వెళ్లిన డబ్బులు టోకెన్ల రూపంలో హైదరాబాద్ కు రావడం ఏంటి అని అమర్‌ నాథ్‌ ప్రశ్నించారు.

తండ్రి కొడుకులు పంది కొక్కుల్లా ప్రజాధనం తినేశారని అమర్‌ నాథ్‌ ఆరోపించారు. ఏలేరు స్కామ్‌., స్టాంప్‌ పేపర్ల కుంభకోణం.,హైటెక్‌ సిటీ నుంచి అమరావతి వరకు చంద్రబాబు హయాం అంతా అవినీతి మయం అని సంచలన ఆరోపణలు చేశారు.

కాగా అమర్‌ నాథ్‌ వ్యాఖ్యలు మరోసారి ట్రోలింగ్‌ కు గురి అవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను తాము సెమీ ఫైనల్‌ అనలేదని ఆయన అడ్డంగా అబద్ధాలు మాట్లాడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలోనూ అమర్‌ నాథ్‌ ఇలాగే పలు అబద్దాలు ఆడారని అంటున్నారు. మద్యపాన నిషేధం గురించి తమ ఎన్నికల మేనిఫెస్టోలో లేదని అమర్‌ నాథ్‌ వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి వైసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పింది.

అలాగే విశాఖ అభివృద్ధిపై ఇటీవల మాట్లాడుతూ అమర్‌ నాథ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ జరిగింది. ఇప్పుడే గుడ్డు పెట్టింది. అది పిల్ల పుట్టి పెరిగి పెద్దదవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతోంది అంటూ వ్యాఖ్యానించి అమర్‌ నాథ్‌ ట్రోలింగ్‌ కు గురయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News