జగన్ కు రుణపడి ఉంటానని చెబుతూ ఈ రచ్చేంది బాసూ?

Update: 2022-04-19 02:30 GMT
చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించే నేతలకు ఏ మాత్రం తీసిపోరు ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్. ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆయన.. మంత్రిగా వ్యవహరించే వేళలో రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆయన దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మంత్రిగా కీలక శాఖను నిర్వర్తించిన అనిల్.. తన పనితో శాఖకు మంచి పేరు తెచ్చే కంటే.. అనవసరమైన వివాదాల్లో ఆయన పేరు అదే పనిగా నానటం.. ఆయన మంత్రి పదవికి ఎసురు పెట్టిందన్న మాట వినిపిస్తోంది.

తన నుంచి చేజారిన మంత్రి పదవి.. రాజకీయంగా తనకు ఏ మాత్రం  పొసగని కాకాణి చేతికి వెళ్లటాన్ని అనిల్  కుమార్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. ఆయన ఏ చిన్న అవకాశం లభించినా విడిచిపెట్టకుండా విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. తన గుండెల్లోని మంటను తెలియజేసేలా ఆయన మాటలు ఉంటున్నాయి. అయితే.. సూటిగా కాకుండా నర్మగర్భ వ్యాఖ్యల్ని వరుస పెట్టి చేస్తున్నారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి.. నెల్లూరులో భారీ సభను ఏర్పాటు చేస్తే.. అందుకు తగ్గట్లే తాను సైతం ఒక సభకు ప్లాన్ చేస్తున్నారు అనిల్. జిల్లాలో తన హవా ఏ మాత్రం తగ్గలేదన్న విషయాన్ని చాటి చెప్పటంతో పాటు.. పదవి పోయిన తర్వాత కూడా అధినేత మీద తనకున్న అంతులేని అభిమానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు.

మంత్రిగా ఉన్నప్పుడు కంటి మీద కునుకు రాని రీతిలో తెగ ఇబ్బంది పెట్టిన కాకాణికి.. అలాంటి పరిస్థితినే తీసుకొస్తానంటూ పరోక్ష వ్యాఖ్యలు చేయటమే కాదు.. చేతల్లోనూ అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు.

తాను ఎవరికి పోటీకాదని.. తనకు తానే పోటీ అన్నట్లుగా చెప్పుకుంటూ.. తానేదో చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదంటూ.. తన అలవాటులో భాగంగా మీడియా మీదా మండిపడుతున్నారు. ఒకవైపు తన రాజకీయ ప్రత్యర్థిపై వ్యాఖ్యలు చేస్తూనే.. పార్టీ లైన్ క్రాస్ చేస్తానన్న మచ్చ తన మీద పడకుండా ఉండేలా ఆయన మాటలు ఉంటున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తాను జీవితాంతం రుణపడి ఉంటానంటూ తన విధేయతను ప్రదర్శిస్తున్నారు.

పార్టీని నమ్ముకున్న కార్యకర్తల్లో 70 శాతం మందికి న్యాయం చేశానని చెప్పిన ఆయన.. తనకు పదవుల మీద వ్యామోహం లేదంటూ చెబుతున్న మాటల్ని విన్నప్పుడు.. మరీ మాటలన్ని దేని కోసం? అన్న సందేహం కలుగక మానదు. నిజంగానే సీఎం జగన్ కు రుణపడి ఉన్నానని అనిల్ చెప్పే మాటలు నిజమైతే.. ఆయన కొంతకాలం నోటికి తాళం వేసుకొని కూర్చోవాలన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ మాటలకు మాజీ మంత్రి అనిల్ ఏ రీతిలో రియాక్టు అవుతారో?
Tags:    

Similar News