అటు ఆది-ఇటు గంటా:బాబు సీటు కింద మంట

Update: 2018-02-18 02:30 GMT
అటు తమదైన దూకుడును ప్రదర్శిస్తూన్న ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ దూకుడును గానీ - ఇటు మిత్రపక్షం అనే ట్యాగ్ లైన్ ఉన్నప్పటికీ ఊపిరాడనివ్వకుండా చేస్తున్న భాజపా నాయకుల కౌంటర్లను గానీ.. ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబునాయుడు దగ్గర ఒక స్కెచ్ ఉంటుంది. అయితే తన స్వపక్షంలోని.. కేబినెట్ లోని సహచరులే.. తమ అదుపులేని మాటల వల్ల తనను ఇరుకున పెట్టేస్తుండడం మాత్రం ఆయనకు మంట పుట్టిస్తోంది. వారు ఎడాపెడా ప్రకటనలు చేసేయడం.. జరిగిన నష్టాన్ని దిద్దుకోలేక ఆయన తలలు పట్టుకోవాల్సి రావడం జరుగుతోంది. చంద్రబాబు బ్రహ్మాస్త్రం లాగా దాచుకున్న ‘ఎన్డీయేకు మద్దతు ఉపసంహరణ- రాజీనామాలు’ అనే అంశాన్ని మంత్రి ఆదినారాయణ రెడ్డి లీక్ చేసేసి దారుణంగా నష్టపరిస్తే.. రాష్ట్రప్రభుత్వం నిధులపై నాలుగైదు శ్వేతపత్రాలు విడుదల చేయాలని అనుకుంటున్నదని  ప్రకటించి మంత్రి గంటా శ్రీనివాసరావు.. కొత్త పితలాటకం తెచ్చిపెట్టారు.

సాధారణంగానే చంద్రబాబునాయుడుకు శ్వేతపత్రం అనే పదం వినిపిస్తే అరికాలి మంట నెత్తికెక్కుతుంది. పైగా తన పాలనలో మంచి చెడు మీద తనే శ్వేతపత్రం విడుదల చేయాల్సి వస్తే - అలాంటి డిమాండ్ ఎవరైనా చేస్తే ఆయనకు పూనకం వచ్చేస్తుంది. ఒంటికాలిపై లేస్తుంటారు. గత కొంతకాలంగా పోలవరంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్వేతపత్రం అడుగుతోంటే.. ఆయన ఎన్నిసార్లు  కస్సుబుస్సులాడారో లెక్కేలేదు. చివరికి అసలు పోలవరానికి నిధులు విడుదల చేస్తున్న భాజపా కు చెందిన నాయకులు కూడా  శ్వేతపత్రం మాటెత్తేసరికి మౌనం దాల్చేశారు. అలాంటిది.. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై తమ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయబోతున్నదని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం చంద్రబాబుకు నచ్చని వ్యవహారం. ఒకసారి శ్వేతపత్రం అంటే.. కేంద్రం నుంచి ఏ రావడం లేదు అని ప్రసంగాల్లో చెప్పినంత తేలిగ్గా చెబితే సరిపోదు. అది అధికార పత్రమే. అందులో వచ్చే నిధుల వివరాలు వెల్లడించినట్లే.. వాటి ఖర్చును కూడా చెప్పాల్సి వస్తే గనుక.. బాబు సర్కారు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని గంటా మాటలు తలనొప్పిగా మారాయని సీఎం అనుకుంటున్నారట.

మార్చి 5న కేంద్రానికి మద్దతు ఉపసంహరణ అనే మాటను మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించేసి.. చంద్రబాబుకు ఒక తలనొప్పి ప్రసాదించి మూడు రోజులు కూడా కాలేదు. ఈలోగా మరో మంత్రి మరో తలనొప్పిని కానుక ఇచ్చాడని ఆయన  మధనపడుతున్నారట.

Tags:    

Similar News