హ‌రీశ్‌ కు షాకిచ్చిన మోడీ ప్ర‌క‌ట‌న‌

Update: 2016-12-03 11:04 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు - సరిప‌డా కొత్త క‌రెన్సీ చెలామ‌ణీలోకి రాక‌పోవ‌డంతో  ఇప్ప‌టికే గ‌రం గ‌రంగా ఉన్న ప్ర‌జానికం బంగారంపై నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌కటించ‌డంతో ర‌గిలిపోతున్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం ఎఫెక్ట్ తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావుకు త‌గిలింది. డిజిట‌ల్ లావాదేవీల్లో భాగంగా టీఎస్ వ్యాలెట్ పేరుతో సొంతంగా ఒక వేదిక‌ను తీసుకురానున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సిద్ధిపేట మున్సిపాలిటీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక‌చేస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. అయితే క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లిన హ‌రీశ్ రావుకు ఊహించ‌ని ప్ర‌క‌ట‌న ఎదురైంది.

నగదు రహిత నియోజకవర్గంగా సిద్దిపేటను తీర్చిదిద్దే క్రమంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు  సిద్దిపేట జిల్లా కేంద్రంలో పలు సంఘాలకు నగదు రహిత లావాదేవీలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో నగదురహిత లావాదేవీలు జరిపే తొలి మూడు గ్రామాలకు రూ.10 లక్షలు ఇస్తామన్నారు. కేంద్రం పెద్ద నోట్లు రద్దుచేయడంతో చిల్లర లేక వ్యాపారాలు సగానికి తగ్గాయని వర్తకులు - వ్యాపారస్తులు చెబుతున్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలతో వ్యాపారం పెరుగుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సహకార - బీడీ కార్మిక సంఘాలు - యాజమాన్యాలు - వ్యాపారస్తులు - అంగన్‌ వాడీ - గ్రామసమాఖ్య సీఏలు - ప్రజాప్రతినిధులు - ఫీల్డ్ అసిస్టెంట్లు - సాక్షరభారత్ కో ఆర్డినేటర్లు - స్థానిక ప్రజాప్రతినిధులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు క‌లిగిన సందేహాల గురించి ప‌లువురు వివ‌రించారు. అనంత‌రం ఓ మ‌హిళ మాట్లాడుతూ కేంద్ర బంగారంపై ప‌రిమితి విధించ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. "నా ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉందో మొగుడే అడ‌గ‌డు..మోడీ ఎందుకు అడ‌గ‌టం?" అంటూ మంత్రి హ‌రీశ్ రావును ప్ర‌శ్నించారు. దీంతో ఒక్కసారిగా హ‌రీశ్ రావు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తూ కేంద్రం నుంచి మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చిన త‌ర్వాత దీనిపై నిర్ణ‌యం ఉంటుంద‌ని గంద‌ర‌గోళం చెంద‌వ‌ద్ద‌ని అక్క‌డున్న వారికి సూచించారు.

 సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దే క్రమంలో మూడు మండలాల్లో నగదు రహిత లావాదేవీలు జరిపే తొలి మూడు గ్రామాలకు రూ.పది లక్షలు - రెండోస్థానంలో నిలిచే గ్రామాలకు రూ.ఐదు లక్షలు - మూడో స్థానంలో నిలిచే గ్రామాలకు రూ.రెండు లక్షలు ప్రోత్సాహక బహుమతి ఇస్తామని హ‌రీశ్ రావు ప్ర‌క‌టించారు. గ్రామపంచాయతీల ప్రజాప్రతినిధులు పోటీపడాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిపించి డెబిట్ కార్డు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ప్రతి ఒక్కరూ ఖాతా తెరిచి డెబిట్‌కార్డును పొందాలని మంత్రి హ‌రీశ్ రావు కోరారు. వ్యాపారులు దుకాణాల్లో విధిగా స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాలో 5 వేల స్వైపింగ్ యంత్రాలను అందజేయనున్నామన్నారు. గ్రామాల్లో బ్యాంకు అధికారులతో పాటు ఇతర అధికారుల బృందం విస్తృతంగా పర్యటిస్తుందని, ప్రతి ఇంటికి వెళ్లి ఖాతా ఉన్నది, లేనిది పరిశీలిస్తారన్నారు. ఖాతాలు లేనివారికి అక్కడికక్కడే ఖాతా - డెబిట్ - క్రెడిట్ కార్డులు ఇస్తారన్నారు. ఇదంతా ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తారన్నారు. బ్యాంకర్లు అందజేసే రూపే కార్డు వాడితే ఎలాంటి పన్నులు ప్రజలపై పడబోవని, రూపే కార్డు పొందిన వారందరికీ రూ.ఐదు లక్షల బీమా సౌకర్యం కలుగుతుందని హరీశ్ రావు వారికి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News