ఆయుధ పూజ కాస్త కేసు అయ్యేటట్లుందే?

Update: 2015-10-26 04:11 GMT
పండుగ.. ఆపై చేతిలో పవర్. ఇంకేముంది కొందరు నేతలు ఉత్సాహం కాస్తా అత్యుత్సాహంగా మారింది. విజయదశమి పర్వదినాన జరిపే ఆయుధ పూజకు సరికొత్త అర్థం ఇచ్చేలా తెలంగాణ అధికారపక్ష నేతలు కొందరు ఆయుధపూజ పేరిట తమ వద్దనున్న లైసెన్డ్స్ గన్ లను గాల్లో కాల్పులు జరపటం ద్వారా తమ ఆయుధ పూజను పూర్తి చేశారు.

అయితే.. ఈ పవర్ పూజ వ్యవహారం మీడియాలోకి రావటం.. ఫోటోలతో సహా పబ్లిష్ కావటంతో అధికారపక్ష నేతలకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇలా ఆయుధ పూజను తమదైన శైలిలో నిర్వహించిన టీఆర్ ఎస్ నేతల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. దసరా రోజున తన పిస్తోల్ ని గాల్లోకి కాల్పులు జరిపిన ఫోటోలు పత్రికల్లో పబ్లిష్ కావటంతో.. అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వరరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధ్యతాయుతమైన మంత్రిస్థానంలో ఉన్న వ్యక్తి.. చట్టవిరుద్ధంగా గాల్లోకి కాల్పులు ఎలా జరుపుతారని ప్రశ్నించటంతో పాటు.. అలా గాల్లోకాల్పులు జరిపి.. రూల్స్ ని బ్రేక్ చేసిన మంత్రిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫిర్యాదు చేసి రెండు రోజులు కావొస్తున్నా మంత్రిపై కేసు నమోదు చేయని అదిలాబాద్ జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..?
Tags:    

Similar News