మోడీ మీద కోపం హిందీ మీదనా.... స్టాలిన్ రూట్లో కేటీయార్

Update: 2022-10-12 08:05 GMT
టీయారెస్ బీయారెస్ గా మారుతోంది. దాంతో పాటు సొంత ముద్రను కోల్పోతోంది. అదే టైమ్ లో పొంతన లేని మాటలను తమకు అతకని డైలాగులను టీయారెస్ నేతలు మాట్లాడుతున్నారు. మంత్రి కేటీయార్ అయితే ఏకంగా ఏందీ హిందీ రుద్దుడు అంటూ కేంద్రాన్ని చాలా సీరియస్ గానే ప్రశించారు. గత నెలలో ఇదే విషయం మీద తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రాన్ని నిగ్గదీశారు. సెప్టెంబర్ 14 నుంచి పదిహేను  రోజుల పాటు హిందీ భాష పక్షోత్సవాలు జాతీయ స్థాయిలో జరిగాయి.

ఆ సమావేశాలలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ భాష ప్రాముఖ్యత గురించి గొప్పగా చెప్పారు. దాన్ని పట్టుకుని స్టాలిన్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. హిందీ అన్ని భాషల మాదిరిగానే ఒక భాష. జాతీయ భాషగా పేరు చెప్పి మా మీద రుద్దుతారా అంటూ మండిపడ్డారు. హిందీలో పాలనపరమైన వ్యవహారాలు సాగాలని ఎలా అంటారని కూడా అడిగి కడిగేశారు.

అయితే స్టాలిన్ హిందీ వ్యతిరేకతకు ఒక మూల సిద్ధాంతం ఉంది. ద్రవిడ ఉద్యమ పార్టీలు ఇప్పటికి అర్ధ శతాబ్దం క్రితమే హిందీని వ్యతిరేకించాయి. తమది ప్రత్యేక కల్చర్ గా చెప్పుకుంటాయి. కాస్తా ముందుకెళ్లి తమకు సొంత అస్థిత్వం కావాలని కూడా డిమాండ్ చేసే స్థాయిలో ద్రవిడ ఉద్యమ నేతలు ఉన్నారు. వారి విషయం ఇప్పటికీ సబబా కాదా అన్నది పక్కన పెడితే దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని తుదికంటా వ్యతిరేకించాలనుకోవడం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఇపుడు అదే రూట్ లోకి కేటీయార్ వచ్చారు. ఆయన మోదీ మీద కేంద్రం మీద విమర్శల జోరు పెంచుతూ హిందీని మధ్యలోకి తీసుకువచ్చారు.  హిందీ జాతీయ భాష కాదు రుద్దితే ఊరుకోమని కేటీయార్ అంటున్నారు. పైగా భారతదేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదని, హిందీ అధికార భాషల్లో ఒకటని కేటీయార్ అంటున్నారు.

ఐఐటీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో హిందీని తప్పనిసరి చేయడం అంటే ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య స్పూర్తిని దెబ్బతీయడమే అని కేటీయార్ విమర్శిస్తున్నారు. భాషను ఎంచుకునే హక్కు భారతీయులకు ఉంది. హిందీని రుద్దితే వ్యతిరెకిస్తామని కేటీయార్ గర్జిస్తున్నారు.

హిందీ కాకుండా స్థానిక భాషల్లో పరీక్షలు పెట్టండని అడగడం వరకూ బాగానే ఉందనుకున్నా హిందీ జాతీయ భాష కాదని కేటీయార్ అనడమే చిత్రం. ఈ రోజుకీ హిందీ జాతీయ భాష అన్న సంగతిని ఆయన మర్చిపోయారని విమర్శలు వస్తున్నాయి. అలాగే హిందీ అధికారిక భాష కూడా. మరి ఏ ఇతర  ప్రాంతీయ భాషలు  అధికారికంగా ఉన్నాయో కూడా కేటీయార్ చెబితే బాగుంటుందేమో.

ఇక ఈ దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదని చెప్పడం వితండ వాదనగానే చూస్తున్నారు. హిందీ భాష తనకు గొప్పగా వచ్చు అనే కదా కేసీయార్ టీయారెస్ ని బీయారెస్ గా మార్చి జాతీయ రాజకీయాలు చేయలనుకున్నది. ఆ విషయం కుమారుడిగా కేటీయార్ కి తెలియదా. ఉత్తరాది వెళ్లి హిందీ కాకుందా ఏ భాష మాట్లాడుతారో కూడా ఆయన‌ చెబితే బాగుంటుందేమో.

ఇక ఆ మాటకు వస్తే తెలంగాణాలో చాలా పల్లెల్లో హిందీని మాట్లాడుతారు, ఉర్దూతో కలిపి మాట్లాడేవారున్నారు. ఇక హిందీని జాతీయ భాష కాదు, జాతీయతే మనకు లేదు పూర్తిగా  సమాఖ్య వ్యవస్థ అంటున్నారు కానీ అన్ని రాష్ట్రాలకు కేంద్రం అనేది ఒకటి బలంగా ఉండాలన్న స్పూర్తిని మరచిపోతే ఎలా సామీ అన్న కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాదు దేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందే అయినపుడు మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఏదో గుడ్డిగా బీజేపీని వ్యతిరేకించాలనుకుని తమిళ స్టాలిన్ గొంతును అరువు తెచ్చుకుని బిగ్ సౌండ్ చేస్తే టీయారెస్ కి నప్పుతుందా అన్నదే చూసుకోవాలని అంటున్నారు. జాతీయ భాషలు లేవు, జాతీయంగా ఒక దేశమే లేదు, అంతా రాష్ట్రాలే అంటున్న కేటీయార్ రేపటి రోజున తన తండ్రి కేసీయార్ కి లక్ తగిలి ప్రధాని అయితే రాష్ట్రాలదే పెత్తనం కేంద్రం అలా చేతులు కట్టుకుని కూర్చోమంటే చూస్తూ ఊరుకుంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల సమాఖ్య స్పూర్తి అని ఎంత పెద్ద మాటలు చెప్పినా హద్దులు సరిహద్దులు ఉన్నాయన్న సంగతి ఈ దేశంలో ఉన్న ప్రతీ రాష్ట్రం గుర్తుంచుకుంటేనే ఆ సమాఖ్యకు కూడా అందం, అర్ధమని కేటీయార్ తో సహా గ్రహించాలి అని అంటున్నారు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News