'ఆవో.. దేఖో.. సీఖో' అంటూ మోడీకి కేటీఆర్ చురకలు

Update: 2022-07-02 05:30 GMT
ప్రత్యర్థులు వేసే చురకలతో మంట పుట్టటం ఖాయం. అర్థం పర్థం లేనట్లు కాకుండా.. ఒక పద్దతి.. చాలా శ్రద్ధతో తిట్టినట్లు చందంగా పంచ్ లు వేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ మహానగరానికి వస్తున్న నేపథ్యంలో.. ఆయనకు చురుకు పుట్టేలా రిథమిక్ గా చురకల్ని సంధించారు.  "ఆవో.. దేఖో.. సీఖో.." అంటూ గళం విప్పిన ఆయన.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని డబుల్ ఇంజిన్ సర్కారులోని దుర్భర పరిస్థితుల్ని తనదైన శైలిలో పేర్కొన్నారు.

హైదరాబాద్ లో ఈ రోజు.. రేపు (శని.. ఆదివారాలు) నిర్వహించే బీజేపీ కార్యవర్గ సమావేశాలపై స్పందిస్తూ.. 'అద్భుత అభివృద్ధితో ప్రపంచ పటంపై స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న హైదరాబాద్‌లో మీ పార్టీ సమావేశం పెట్టుకోవడం నాకేౖతే ఆశ్చర్యం అనిపించడం లేదు.

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు కొలువైన మీ రాష్ట్రాల్లో ఉన్న దుర్భర పరిస్థితులే మిమ్మల్ని తెలంగాణకు రప్పించి ఉంటాయని భావిస్తున్నా. కారణాలు ఏవైనా మీ పార్టీ నాయకత్వం మొత్తం హైదరాబాద్‌లో మకాం పెడుతున్న ఈ సందర్భంలోనైనా కాసింత తెలంగాణతనాన్ని నేర్చుకోవాలని, ఇక్కడి గాలి గానం చేసే గంగా జమునా తెహజీబ్‌ను గుండెల నిండా నింపుకోవాలని సలహా ఇస్తున్నా' అని వ్యాఖ్యానించారు.

కులం.. మతం.. జాతి ఆధారంగా సమాజాన్ని విభజించే దుర్మార్గ రాజకీయాల చుట్టూనే బీజేపీ కార్యవర్గ సమావేశాల చర్చలు సాగుతాయన్న దానిలో తనకు ఎలాంటి అనుమానం లేదన్న కేటీఆర్ర.. ప్రజలకు పనికి వచ్చే విషయాల మీద సమావేశాల్లో చర్చలు జరుపుతారని అనుకోవటం అత్యాశే అవుతుందన్నారు. "వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల అసలు అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికీ తెలుసు" అంటూ విరుచుకుపడ్డారు.

భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తితో అభివృద్ధి అజెండాను చర్చించేందుకు తెలంగాణను మించిన గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదన్న కేటీఆర్.. మీ విధానాలు.. నినాదాలను మార్చుకుంటారో లేదంటే మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుంటారో మీ ఇష్టమన్నారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణ త్యాగాలను చులకన చేసి మాట్లాడిన మోడీ.

ఈ గడ్డ బాగు కోరుతారని ఎవరూ భావించటం లేదన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాలకు తమ కార్యక్రమాలే స్ఫూర్తి అని అందుకే రండి.. చూడండి.. నేర్చుకోండి (ఆవో.. దేఖో.. సీఖో) అంటున్నట్లుగా పేర్కొన్నారు. మొన్నటి వరకు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించిన కేటీఆర్ గొంతులో అకస్మాత్తుగా ఈ కొత్త మాటలేమిటో?
Tags:    

Similar News