రూపాయి పడిపోయిన వేళ.. నిర్మలమ్మకు కేటీఆర్ భారీ పంచ్ లు

Update: 2022-09-24 04:34 GMT
నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను మాత్రం ఊరుకుంటానా? అన్నట్లుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీపై టార్గెట్ చేసి.. నిత్యం ఏదో ఒక అంశం మీద ఆయనపై విమర్శలు గుప్పించటం.. ప్రశ్నలు సంధించటం లాంటివి చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల కాలంలో క్యూ కడుతున్న బీజేపీ ప్రముఖుల్లో ఎవరైనా తమ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా వ్యవహరిస్తే.. వారిని వదలకుండా విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయటం.. టైమ్లీగా రియాక్టు అవుతూ పంచ్ లు వేయటం లాంటివి మంత్రి కేటీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి.

ఈ మధ్యన తెలంగాణకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించటమే కాదు.. జిల్లా కలెక్టర్ పైనా ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ మీద టీఆర్ఎస్ నేతలందరితో పోలిస్తే.. మంత్రి కేటీఆర్ ఘాటుగా రియాక్టు కావటమేకాదు.. ఆ తర్వాతి నుంచి తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా డాలర్ తో రూపాయి మారకం విలువ ఎప్పుడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోవటంతో.. ఆ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ కేంద్రం మీద విరుచుకుపడ్డారు. 'రూపాయి విలువ ఎన్నడూ లేనంత దిగజారింది. కానీ.. అబద్ధాలు మాత్రం ఎన్నడూ లేనంతగా పెరిగాయి. రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోతున్నా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటోను వెతకటంలో తీరిక లేకుండా ఉన్నారు' అంటూ పాత విషయాలపై సరికొత్తగా సెటైర్లు వేయటం గమనార్హం.

ఈ సందర్భంగా నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించటం కనిపిస్తుంది. రూపాయి తన సహజ మార్గంలో వెళుతోందని.. ఆర్థిక ఇబ్బందులు.. నిరుద్యోగం.. ద్రవ్యోల్బణం తదితరాలన్నీదేవుడి లీలలుగా మీకు చెబుతారంటూ..''విశ్వగురు వర్ధిల్లాలి అని నినదించమంటారు. రూపాయి విలువను ప్రపంచ మార్కెట్లు.. ఫెడ్ రేట్లు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి అంటూ చెప్పుకునే భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. విశ్వగురు మోడీమీ వాదనను అంగీకరించరు. కేంద్రంలో అవినీతి పెరగటం వల్లే రూపాయి విలువ పడిపోతోంది. రూపాయి ఇంటెన్సీకేర్ లో ఉంది' అంటూ మండిపడ్డారు.

ఈ సందర్భంగా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి మారకం విలువ పడినప్పుడు.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కారుపై ఘాటు విమర్శలు చేసే వారంటూ అప్పట్లో మోడీ షేర్ చేసిన ట్వీట్ల క్లిప్పింగులను పోస్టు చేయటం గమనార్హం. మొత్తానికి మోడీ సర్కారును తాను ఎంత మాత్రం వదిలేది లేదన్న విషయాన్ని తెలియజేసేలా మంత్రి కేటీఆర్ ట్వీట్లు ఉన్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News