ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్

Update: 2022-12-17 06:32 GMT
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏది చేసినా కామెడీయే.. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన మల్లారెడ్డికి కష్టం సుఖం తెలుసు. అందకే దేశంలోనే అతిపెద్దఐటీ దాడి తనపైనే జరిగిందని.. అది కూడా రికార్డ్ అని గర్వంగా చెప్పుకోవడం విశేషం. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలోని సీఎంఆర్ గ్రూప్స్ ఆడిటోరియంలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనపై ఇటీవల జరిగిన ఐటీ దాడి మూడోసారి కావడంతో హ్యాట్రిక్ గా భావిస్తున్నానని అన్నారు.  తాను పాల వ్యాపారంనుంచి మంత్రి స్థాయికి ఎదిగానని. అందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పుకున్నారు. తన విద్యాసంస్థల్లో పదివేల మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని.. మన ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని.. అందుకు డిగ్రీలు అవసరం లేదని.. లక్ష్యం ఉంటే చాలని మంత్రి మల్లారెడ్డి నీతిసుత్రాలు వల్లించారు.

ఇటీవల మల్లారెడ్డి మాట్లాడుతూ తన మెడికల్ కాలేజీల్లో డొనేషన్ సీట్లే లేవని.. అన్నీ ఆన్ లైన్  అడ్మిషన్ సీట్లేనని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు సీటు కావాలన్నా నేను ఇవ్వలేదన్నారు. నేను భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్ చేయించానని.. నాపై ఐటీ దాడులు చేసినా అసలు భయపడేది లేదన్నారు. 400 మంది ఐటీ అధికారులు వచ్చి వాళ్ల పని వాళ్లు చేసుకొని వెళ్లారన్నారు. ఐటీ దాడుల్లో ఏమీ దొరక్కపోవడంతో అధికారులు నాపై నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లారని మల్లారెడ్డి విమర్శించారు.

జీవితంలో సాధించాలంటే.. ప్రేమ, ఫ్రెండ్ షిప్ లాంటి వాటికి దూరంగా ఉండాలని.. కొన్ని సాధించాలంటే కొన్నింటిని వదులుకోవాల్సిందేనని తెలిపారు. తనంత అదృష్టవంతుడు ఎవరూ లేరని.. కలలను నిజం చేసుకున్నానంటూ తెలిపారు. భూమి అమ్మి కొడుకును డాక్టర్ చదువు చదివించానని.. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయ్యానని చెప్పారు. తాను ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని.. మనసులో ఏమీ దాచుకోనని మల్లారెడ్డి తెలిపారు.

ఇటీవల మల్లారెడ్డిపై రెండు రోజుల పాటు ఐటీ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కోట్ల నగదుతోపాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్ధేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి.

అనధికారికంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు.  సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News