సంక్షేమం హ‌క్కు మ‌రో సారి ఇదే మాట ధ‌ర్మాన నోట

Update: 2022-05-05 07:49 GMT
సంక్షేమం అన్న‌ది ప్ర‌జ‌లంద‌రి హ‌క్కు అని అది రాజ్యాంగం ప్ర‌సాదించిన హ‌క్కు అని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అంటున్నారు. ఇదే మాట ప్ర‌జ‌ల్లోకి బ‌లీయంగా వెళ్లేందుకు గ‌త కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌య‌త్నించారు. ఇప్పుడు కూడా సంక్షేమ‌మే ధ్యేయంగా తాము ప‌నిచేయ‌నున్నామ‌ని అంటూనే విప‌క్ష నేత చంద్ర‌బాబు ను మ‌ళ్లీ మ‌ళ్లీ టార్గెట్ చేశారు.

నిన్న‌టి వేళ శ్రీ‌కాకుళం జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం అయిన నేప‌థ్యంలో ఆయ‌న స్వ‌రం ఒక్క‌సారిగా మారిపోయింది. మ‌ళ్లీ మ‌ళ్లీ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కే ఆయ‌న ప్రాధాన్యం ఇస్తూ ప‌లు గ్రామాల‌లో  ప్ర‌భుత్వ కార్యక్ర‌మాల‌ను సైతం ఎన్నిక‌ల ప్రచార కార్య‌క్ర‌మాలుగా మారుస్తున్నారన్న అప‌వాదును ఆయ‌న విప‌క్షం నుంచి ఎదుర్కొంటున్నారు.

ఇంత‌కూ ఆయ‌న ఏమ‌న్నరంటే..అధికారంలోకి వ‌చ్చాక గ్రామంలో ఉండే వారికి హాయిగా జీవించేందుకు సంక్షేమ పథకాలు, వ్యవసాయ చేసే రైతులకు సూచనలు చేసేందుకు రైతు భరోసా కేంద్రాలు , పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కేంద్రాలు స‌మ‌ర్థ రీతిలో నిర్వ‌హిస్తున్నాం అని అన్నారు రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.

శ్రీ‌కాకుళం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, గార మండ‌లం జొన్న‌ల‌పాడు, రామ‌చంద్రాపురం గ్రామాల‌లో ఆయ‌న ప‌ర్య‌టించి సంక్షేమ ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ వెనుక ఉన్న ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడేళ్లే అయిన‌ప్ప‌టికీ ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేశామ‌ని చెప్పారు.

ఇవి విన్నాక విప‌క్షం ఏమంటుందంటే..సంక్షేమం హ‌క్కే అయితే సున్నా వ‌డ్డీ రుణాల అమ‌లులో వివ‌క్ష ఎందుకు..లేదా వివిధ ప‌థ‌కాల అమ‌లులో వివ‌క్ష ఎందుకు, ఆశ్రిత ప‌క్ష‌పాత ధోర‌ణి ఎందుకు అని నిలదీస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు ఉంచుతున్నారు. వైసీపీ నాయ‌కులు అన‌వ‌స‌ర విష‌యాల‌కు ప్రాధాన్యం ఇస్తూ త‌మ ప‌రువు తామే తీసుకుంటున్నార‌ని అన్నారు.

ఆ రోజు వంశ‌ధార ప‌నులు 92శాతం తామే పూర్తి చేస్తే మిగిలిన 8 శాతం పూర్తికి మూడేళ్ల కాలం కూడా స‌రిపోలేద‌ని అయినా కూడా తెలివిగా న‌దుల అనుసంధానం అన్న విష‌యం తెర‌పైకి తెచ్చి రెండు న‌దుల‌కు ఒక లింకేజీ కాలువ‌ను క‌ట్ట‌డం కూడా గొప్ప విష‌యంగానే చెప్పుకుంటున్నార‌ని టీడీపీ  ఎద్దేవా చేస్తోంది. చంద్ర‌బాబు స‌భ మ‌రియు రోడ్ షో హిట్ అయిన నేప‌థ్యంలో అటు టీడీపీ ఇటు వైసీపీ మాట‌ల యుద్ధం ఉత్తరాంధ్ర ఊళ్ల‌లో బాగానే పెరిగిపోయింది. తాజా వాగ్యుద్ధం కార‌ణంగా కొన్ని నిజాలు వెల్ల‌డిలోకి ఇరు ప‌క్షాల నుంచి వెల్ల‌డిలోకి వ‌స్తే మేలు.
Tags:    

Similar News