నా మీద ఆదేశాలు అమలవుతాయా ? : మంత్రి పెద్దిరెడ్డి

Update: 2021-02-06 13:12 GMT
మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఈ మ‌ధ్య హాట్ టాపిక్ గా మారుతున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌ల క‌మిష‌న్, రాష్ట్ర సర్కార్ కి మ‌ధ్య జ‌రిగిన ఫైట్ లో కీల‌కంగా మారారు. ఎన్నిక‌ల‌ను ఆప‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఎన్నికలు నిర్వహించాల్సి రావడం తో ప్రభుత్వం అయిష్టతతోనే ఎన్నికలకి సిద్ధమైంది. అయితే మంత్రి పెద్దిరెడ్డి మాత్రం వీలుచిక్కినప్పుడల్లా ఎస్ ఈసి నిమ్మగడ్డ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఏకగ్రీవాలపై మాట్లాడుతూ .. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రెండు నెల‌లు మాత్ర‌మే ఉంటారు. ప్ర‌భుత్వం త‌ర్వాత కూడా ఉంటుంది. ఏకగ్రీవమైన పంచాయతీల్లోని అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు.

పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు శనివారం లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్‌ఈసీ లేఖలో పొందుపరిచారు. ఎస్‌ ఈసీ నిమ్మగడ్డ రమేష్ విధించిన ఆంక్షలపై పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. తాను ఇంట్లోనే ఉన్నా జరిగేది జరుగుతుందని, తాను తిరిగినా తిరగకపోయినా రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. నిమ్మగడ్డకు ఇంగితజ్ఞానం లేదని, తెలిసీతెలియని మూర్ఖుడు అని నిప్పులు చెరిగారు. ఇంగితజ్ఞానం లోపించిన ఆదేశాలను అమలు చేయలేమని అన్నారు. నిమ్మగడ్డ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నిమ్మగడ్డ ఆదేశాలు పాటించే వారిపై చర్యలు తప్పవు అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ ఆదేశాలు వస్తాయని ముందే ఊహించా , నా మీద ఆదేశాలు ఇచ్చే ముందు అవి , అమలు అవుతాయో లేదో అని చూసుకోవాలి అని అన్నారు.



Tags:    

Similar News