మంత్రి గారు వర్సెస్ పోలీస్... అవమానం ఎవరిది... ?

Update: 2022-02-09 16:50 GMT
విశాఖలోని శారదాపీఠానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చిన సందర్భంగా ఆయనతో పాటుగా వచ్చిన మంత్రి సీదరి అప్పలరాజుకు అవమానం జరిగింది అని మీడియాలో న్యూస్   పెద్ద ఎత్తున వచ్చింది. మంత్రిని అక్కడ పోలీసులు అడ్డుకున్నారని, దాంతో మంత్రి గారు అలిగి వెనక్కి వెళ్ళిపోయారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే దీని వెనక వేరే విషయాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు అంటున్నాయి. తాము మంత్రి సీదరి అప్పలరాజుని అవమానించలేదని, ఆయనే సీఐని నానా దుర్భాషలు ఆడారని పోలీసులు చెబుతున్నారు. దీనికి వీడియో రికార్డింగ్ సాక్ష్యం కూడా ఉందని అంటున్నారు.

అసలు విషయానికి వస్తే శారదాపీఠానికి మంత్రి సీదరి అప్పలరాజు తన అనుచరులను వెంటబెట్టుకుని వచ్చారు. అయితే సీఎం టూర్ కాబట్టి కేవలం మంత్రిని తప్ప అనుచరులను అనుమతించమని అక్కడ డ్యూటీ సీఐ చెప్పేశారు. ఈ విషయంలో మంత్రి సీరియస్ అయ్యారు. అయినా సీఐ మాత్రం భద్రతాపరమైన అంశం కాబట్టి ఇంతే అని తేల్చేశారుట.

అంతే మంత్రి గారు కట్టలు తెంచుకున్న ఆవేశంతో సీఐ మీద నానా దుర్భాషలు ఆడారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మీ సంగతి హోం మంత్రితోనే తేల్చుకుంటామని కూడా హెచ్చరించి సీదరి అప్పలారాజు అక్కడ నుంచి వెళ్లిపోయారు అంటున్నారు. నిజానికి అక్కడ అవమామం జరిగింది మంత్రికి కాదని సీఐ స్థాయి అధికారికి అని పోలీసులు చెబుతున్నారు. ఇవన్నీ తాము రికార్డు చేసిన వీడియోలో ఉన్నాయని కూడా పేర్కొన్నారు. మరి మంత్రికి అవమానమని  అని మీడియాలో పొద్దు పొద్దున్న వచ్చినా  సాయంత్రం అయ్యేసరికి అసలు మ్యాటర్ ఇదీ అంటూ పోలీసులు  చెప్పుకొస్తున్నారు.

మరి దీని మీద పంచాయతీ ఎటూ ఉంటుంది. పోలీసు ఉన్నతాధికారిని నానా దుర్భాషలు ఆడిన మంత్రి గారిది తప్పు అంటారా, లేక పోలీసుల మీదనే యాక్షన్ అంటారా అన్నది  పెద్దలే చెప్పాలని అంటున్నారు.  ఇదిలా ఉంటే వైసీపీ నేతలు కొందరు పోలీసుల మీద ఇలా నోరు చేసుకోవడం ఏపీలో అనేక చోట్ల  గతంలో కూడా జరిగిందని, అయినా వారి మీద యాక్షన్ లేదని కూడా అంటున్నారు. దీనిని బ‌ట్టి ఈ మ్యాటర్ లో మంత్రి గారి అవమానమే హైలెట్ చేసి ఆయన అలకకే ప్రాధాన్యత ఇస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది మరి. చూడాలి ఏం జరుగుతుందో,  ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్తుందో.
Tags:    

Similar News