మిస్ థాయ్ లాండ్ అమ్మ వృత్తి ఏంటో తెలుసా ?

Update: 2015-10-29 22:30 GMT
అందాల భామ వయ్యారంగా దిగింది. ఆమె ప్ర‌తి అడుగునూ బంధించేందుకు మీడియా కెమేరాలు విప‌రీత‌మైన ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆమె మామూలు వ్య‌క్తి కాదు. స‌రికొత్త సెల‌బ్రిటీ. మిస్ అన్ సెన్సార్డ్ న్యూస్ థాయ్ లాండ్ 2015 విజేత‌. అందాల పోటీలో గెలిచిన భామకు ఎంత‌టి క‌వ‌రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అందుకు 17 ఏళ్ల మింట్ క‌నిస్తా మిన‌హాయింపేమీ కాదు. అందాల పోటీలో విజ‌యం సాధించిన త‌ర్వాత ఆమె బ‌య‌లుదేరింది.

క‌ట్ చేస్తే.. అందాల పోటీలో గెలిచిన ఆమె.. చెత్త డ‌బ్బాల ద‌గ్గ‌ర చెత్త ఎత్తుకుంటున్న ఒక మ‌ధ్య వ‌య‌స్కురాలి వ‌ద్ద‌కు వెళ్లింది. పాదాభివందనం చేసింది. అందుకు ఆమె ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదు. మురికి చేతుల‌తో ఉన్న ఆమె.. ఈ సుంద‌రిని ఆశీర్వదించింది. ఆమె వెంట ఉన్న ఫోటోగ్రాఫ‌ర్ పంట పండింది. అందాల భామ అస‌లు జీవితం.. ఆమె ప‌రిస్థితుల్ని కెమేరాలో బంధించేశాడు. ప‌క్క‌రోజు ఒక్క థాయ్ ల్యాండ్ లోనే కాదు.. ఆసియా మొత్తంగా ఈ ఫోటోలు  ట్రెండ్ సృష్టించాయి. ఇంత‌కీ  ఆ చెత్త ఎత్తే వ్య‌క్తికి ఆమెకు మ‌ధ్య సంబంధం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు వ‌చ్చే స‌మాధానం.. ఆ అందాల బొమ్మ‌ను క‌న్న అమ్మ అని.

పుట్టెడు పేద‌రికంతో బ‌తుకు బండి లాగించే కుటుంబానికి చెందిన మింట్ క‌నిస్తా ఇప్పుడు చాలామందికి స్ఫూర్తిదాత‌గా మారింది. ఒక్క‌సారిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన‌ప్ప‌టికి త‌న గ‌త జీవితాన్ని అస్స‌లు విస్మ‌రించలేదు స‌రిక‌దా దాచే ప్ర‌య‌త్నం అస్స‌లు చేయ‌లేదు. అదే ఆమెను మ‌రింత అభిమానించే అంశంగా మారింది.

ఇక‌.. మింట్ గురించి చెబితే.. ఆమె త‌న పేద‌రికాన్ని తిట్టుకోదు. విమ‌ర్శించ‌దు. త‌క్కువ చేసి అస్స‌లు చూడ‌దు. రేప‌టి గురించి ఆశ‌గా ఎదురు చూస్తుంటుంది. అవ‌కాశాల కోసం వెతుకుతుంటుంది. అదే ఆమెను ఇప్పుడున్న స్థాయికి తీసుకొచ్చింది. తండ్రి అండ లేని ఆ  కుటుంబానికి త‌ల్లే అన్నీ అయి పోషించింది. త‌ల్లి క‌ష్టాన్ని మింట్ క‌నిస్తా గుర్తించేది. త‌ల్లి చేసే ప‌నికి చేదోడు వాదోడుగా నిలుస్తూ.. చెత్త ఎత్తే ప‌నిలో సాయం కూడా చేసేదే త‌ప్ప‌.. ఛీద‌రించుకునేది కాదు.

ఇంటి ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా హైస్కూలు వ‌ర‌కు మాత్ర‌మే చ‌దివిన మింట్ క‌నిస్తా.. కాలేజీకి వెళ్లే స్తోమ‌త లేక చ‌దువు ఆపేసింది. బ‌తుకుదెరువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసేందుకు వెనుకాడ‌లేదు. ఇదే స‌మ‌యంలో అందాల పోటీ గురించి స్నేహితుల ద్వారా ఆమెకు తెలిసింది. త‌న‌కెందుక‌ని భావించినా ఆమెను స్నేహితులు ప్రోత్స‌హించారు. త‌ల్లి ట్రై చేయ‌మంది. అంతే.. ఆమె పోటీకి సిద్ధ‌మైంది. బ‌రిలోకి నిలిచిన ఆమె.. మిగిలిన వారిని అధిగ‌మించి విజేత‌గా అవ‌త‌రించింది. బాహ్య‌సౌంద‌ర్య‌మే కాదు.. అంతఃసౌంద‌ర్యం నిండుగా ఉన్న మింట్ క‌నిస్తా తీరు థాయ్ ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేస్తోంది.

ఇప్పుడామెకు సినిమాలు.. టీవీ షోల్లో అవ‌కాశాలు వెల్లువ‌లా వ‌చ్చేస్తున్నాయి. మొత్తంగా ఆమె జీవితం మారిపోయింది. సంప‌ద ఇప్పుడు ఆమె ఇంటి చుట్ట‌మైంది. నిన్న‌టి పేద‌రికం ఇప్పుడు ద‌రికి రానంత దూరంగా పారిపోయింది. అయితే.. క‌ష్టాన్ని న‌మ్ముకున్న ఆమె త‌ల్లి మాత్రం త‌నకింత కాలం అన్నం పెట్టిన చెత్త ఎత్తే ప‌నిని మాత్రం మాన‌ని చెప్పేసింద‌ట‌. ఓపిక ఉన్నంత వ‌ర‌కూ తానీ ప‌ని చేసుకుంటాన‌ని.. ఆ త‌ర్వాత కూతురి ద‌గ్గ‌ర‌కు విశ్రాంతి తీసుకునేందుకు వెళ‌తాన‌ని చెబుతోంద‌ట‌. మింట్ క‌నిస్తా ఇప్పుడు త‌న కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇలాంటి మంచి మ‌న‌సున్న అందాల భామ‌కు ఆల్ ద బెస్ట్ చెబుదామా?
Tags:    

Similar News