చెరువుల్లోనూ గులాబీ పూలు!

Update: 2015-04-13 09:27 GMT
తెలంగాణలో ట్రాక్టర్లు గులాబీ రంగులోకి మారడమే కాదు.. కొత్త రాష్ట్రంలోని చెరువుల్లో కూడా గులాబీలు పూస్తున్నాయి. ఆ పూసిన గులాబీలు గులాబీ నేతల ఇళ్లకే వెళుతున్నాయి. మిషన్‌ కాకతీయ కాస్తా మిషన్‌ ఆమ్యామ్యాగా మారిపోతోంది. వెరసి, ముఖ్యమంత్రి కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు ఎన్ని నీతులు చెప్పినా చివరకు ప్రతిష్ఠాత్మక మిషన్‌ కాకతీయ పథకం కూడా ఆ కోవలోకే చేరిపోతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్రుల పాలనలో తెలంగాణలోని చెరువులు అన్నిటినీ సర్వ నాశనం చేసేశారని, ఇప్పుడు తాము వాటిని పునరుద్ధరిస్తున్నామని, తద్వారా తెలంగాణలో మళ్లీ కాకతీయుల పాలన రాబోతోందని కేసీఆర్‌, హరీశ్‌ రావు పదే పదే వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని అవినీతి రహింగా నిర్వహిస్తామని కూడా గొప్పలు చెప్పారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నం. సీమాంధ్రుల పాలనలో ఎటువంటి అవలక్షణాలు అయితే ఉన్నాయని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారో అవే అవలక్షణాలను టీఆర్‌ఎస్‌ నాయకులు అందిపుచ్చుకుంటున్నారు.

చెరువు పనులు అంటే చెరుపు పనులనే అర్థం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతోంది. ఎకరా ఆయకట్టు కూడా లేని చెరువును బాగు చేస్తామంటూ ఎమ్మెల్యేల నేతృత్వాల్లోని బృందాలు ఎంపిక చేస్తున్నాయి. ఇందుకు ఏకంగా పది లక్షల నుంచి పాతిక లక్షల వరకూ నిధులు మంజూరు చేస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ వరంగల్‌, కరీంనగర్‌ ఎక్కడ చూసినా ఇదే తంతు. టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలకు ముఖ్య అనుచరుల గ్రామాల్లో చెరువులను ఎంపిక చేస్తున్నారు. టెండర్లలో తమకే దక్కేలా చూసుకుంటున్నారు. ఆ టెండర్లు తమకే దక్కితే ఎటువంటి ఇబ్బంది లేదు. తూతూ మంత్రంగా పనులు చేసి మొత్తం డబ్బులు జేబులో వేసుకుంటున్నారు. ఎవరైనా కాంట్రాక్టరుకు దక్కితే అతనికి 15 శాతం గుడ్‌విల్‌ ఇచ్చి ఆ పనులు తీసుకుంటున్నారు. అందుకు కూడా ఒప్పుకోకపోతే 15 శాతం కమీషన్‌ తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. వెరసి, మిషన్‌ కాకతీయలో 15 శాతం నుంచి 65 శాతం వరకూ స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు నొక్కేస్తున్నారు.

ఇక మిషన్‌ కాకతీయను అధ్యయనం చేస్తున్న అమెరికా యూనివర్సిటీలు ఇక్కడ ఏ స్థాయిలో కమీషన్ల పర్వం నడుస్తోందో ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు, ఎంపికలో లోపాలు జరుగుతున్నాయో పరిశోధన చేస్తే మరింత చక్కగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Tags:    

Similar News