అమరావతి కుంభకోణం...సీబీఐ విచారణకు లోక్ సభలో మిథున్ రెడ్డి డిమాండ్

Update: 2020-09-16 17:00 GMT
అమరావతిలో భూముల కొనుగోలు, రాజధాని నిర్మాణం పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని వైసీపీ నేతలు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించడం, ఏసీబీ దర్యాప్తు ప్రారంభించడం వంటి పరిణామాలు జరిగాయి. తాజాగా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగించారు. అమరావతిలో భూముల కొనుగోలు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని మిథున్ రెడ్డి లోక్ సభలో గళమెత్తారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని సభాముఖంగా కేంద్రాన్ని కోరారు. ఏపీ రాజధాని ఏర్పాటు సమయంలో భారీ కుంభకోణం జరిగిందని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో 4 వేల ఎకరాలకు పైగా భూమికి సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కుట్రపూరితంగా లక్షల రూపాయలకే కొందరు చేజిక్కించుకున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుపై మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజధాని విషయంలో నాటి టీడీపీ ప్రభుత్వం దాగుడు మూతలు ఆడిందని, కృష్ణా జిల్లా తిరువూరులో రాజధాని అని చంద్రబాబు అందరినీ ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆ సమయంలో అమరావతిలో తెల్లరేషన్‌ కార్డులున్న తమ బినామీలతో భూములు కొనిపించారని ఆరోపించారు. అమరావతి రాజధాని భూముల్లో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం అని సభకు వెల్లడించారు. అందుకే, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజధాని భూముల కొనుగోలులో అవకతవకలపై నిష్పాక్షిక విచారణ జరగాలనుకుంటున్నామని, అందుకే, రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని వెల్లడించారు.

రాజధాని భూకుంభకోణం కేసు ఎఫ్‌ఐఆర్‌ను రహస్యంగా ఉంచాలంటూ హైకోర్టు ఆదేశించిందని, మీడియా, సోషల్‌ మీడియాలో ఎఫ్‌ఐఆర్‌ గురించి రాయొద్దంటూ ఆదేశాలు జారీ చేసిందని మిథున్ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో మాజీ అడ్వకేట్‌ జనరల్‌ తో పాటు ఒక న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లు ఉండడం వల్లే ఈ ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఒకే న్యాయం ఉండాలని అన్నారు. ఇదే తరహాలో ఏపీలో రూ.2వేల కోట్ల విలువైన ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం జరిగిందని, ఆ కుంభకోణంలోనూ సీబీఐతో దర్యాప్తు చేయించాలని మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Tags:    

Similar News