ఇలాంటి దమ్ము దేశంలో మరే ముఖ్యమంత్రికి ఉండదు

Update: 2021-08-29 08:23 GMT
పొగడ్త ఎంతటి వారినైనా పడేస్తుంది. ఇక.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని ప్రసన్నం చేసుకోవటానికి అయితే మాటలు.. లేదంటే చేతల్లో వినయాన్ని.. విధేయతను ప్రదర్శించే తీరు నిత్యం చూస్తుంటాం. సొంత పార్టీ నేతలు పొగిడే పొగడ్తలకు తన్మయత్వం చెందటం.. పెద్దగా పొగడని వారి కంటే ఎంత బాగా పొగిడితే.. అంతలా ఫిదా అయ్యే తీరు ఇప్పటివరకు చూసి ఉంటాం. అందుకు భిన్నంగా.. నోటి నుంచి పొగడ్త వచ్చినంతనే.. వార్నింగ్ ఇచ్చే ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూశామా? అంటే.. నో చెప్పేస్తారు ఎవరైనా.

అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. తనను ఎవరైనా పొగిడితే చాలు.. ఆయన అస్సలు ఊరుకోవటం లేదు. పవర్ చేతిలో ఉన్నప్పుడు పొగడటం.. పవర్ పోయిన తర్వాత పత్తా లేకుండా పోవటం.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడకు వెళ్లే నేతల తరం వచ్చేసిన వేళ.. ఇలాంటి వాటికి చెక్ చెప్పేలా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. తాజాగా తమిళనాడు సీఎం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వార్తల్లోకి వచ్చారు.
ఇటీవల కాలంలో తనను అదే పనిగా పొగిడే ఎమ్మెల్యేలకు ఆయన చురకలు అంటిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మైకు దొరికినంతనే తన గురించి విపరీతంగా పొగిడేస్తూ.. మాటలతో తనను గాల్లోకి ఎత్తేసే సొంత పార్టీ నేతలకు దిమ్మతిరిగే షాకిచ్చారు స్టాలిన్. ఎవరూ కూడా తనను పొగడొద్దన్నారు. తాజాగా ఈ విషయం మీద ఆయన సున్నితంగా వార్నింగ్ కూడా ఇచ్చేశారు.

తాజాగా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ..తనను అదే పనిగా పొగిడేస్తున్నారు. దీంతో మధ్యలో కల్పించుకున్న సీఎం స్టాలిన్.. అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పొగడ్తలతో సభా సమయం వేస్ట్ చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్  ఇచ్చారు. ఎమ్మెల్యేలు అనవసర ప్రసంగాలు మాని.. బడ్జెట్.. రాష్ట్ర సమస్యలపై చర్చించి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్నారు. పొగడ్తలకు పడిపోయే ముఖ్యమంత్రుల్ని ఇప్పటివరకు చూశాం. అందుకు భిన్నంగా.. వ్యవహరించిన స్టాలిన్ బాటలోకి మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడు వస్తారో? నిజానికి పొగడ్తలు వద్దనటానికి చాలానే దమ్ము కావాలి. అది తన దగ్గర ఉందని స్టాలిన్ తన తాజా వార్నింగ్ తో స్పష్టం చేశారని చెప్పాలి.
Tags:    

Similar News