తంగవేల్ కు స్టాలిన్ సత్కారం.. ప్రభుత్వ ఉద్యోగం

Update: 2021-11-04 13:30 GMT
పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటి.. పతకం సాధించిన మారియప్పన్‌ తంగవేల్‌ అనే క్రీడాకారుడిని తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆతని విజయానికి తగిన  ప్రోత్సాహంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వయంగా అతనికి అందజేశారు. మారియప్పన్ తంగవేల్ ది... తమిళనాడులోని సేలం జిల్లా. ఈయన ఇటీవల జరిగిన పారా ఒలంపిక్స్ లో భారత్ తరుపున హైజంప్ విభాగంలో పాల్గొన్నారు. గతంలో జరిగిన రియో ఒలిపింక్స్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి పెట్టారు. దీంతో సొంత గ్రామం అయిన పెరియవడకం పట్టిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సారి టోక్యో పారా ఒలింపిక్స్‌ లో మరోసారి ప్రతిభ చూపి.. హైజంప్‌ విభాగంలో రజిత పతకం దక్కించుకున్నారు. దీంతో వరుసగా రెండు ఒలంపిక్స్ లో పతకాల పంట పండించారు.

ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో తన ప్రతిభకు కానూ  అనేక పతకాలు దక్కాయి. కానీ తనకు సరై గుర్తింపు దక్కలేదని మారియప్పన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒలంపిక్ పోటీల్లో పతకాలు దక్కించుకున్న వారికి స్థానిక ప్రభుత్వాలు సర్కారీ నౌకరీని ఇచ్చి ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఈ క్రమంలోనే దీనిపై సీఎం స్టాలిన్ వాకబు చేశారు. వివరాలు అడిగి తెలుసుకొని.. రాష్ట్రంలోని కరూర్ లో ఉండే కాగిత పరిశ్రమలోని సేల్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగాన్ని ఇస్తూ నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను చెన్నైలోని సచివాలయంలో మారియప్పన్ తంగవేల్ కు స్వయంగా సీఎంనే అందజేశారు. దీనికి సంబంధించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీ కనిమొళి తదితరులు పాల్గొన్నారు. తనకు ప్రభుత్వం ఉద్యోగం దొరకడం చాలా ఆనందంగా ఉందని మారియప్పన్ అన్నారు.

తనకు ఈ విధంగా సహయం చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనలాంటి ఎంతో మంది ప్రతిభ కలిగిన వారికి ఇదో ప్రోత్సాహం అని అన్నారు. రాష్ట్రంలోని పారా క్రీడా అసోసియేషన్‌కు గుర్తింపు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. ఈ విధంగా చేయడం వల్ల మరి ఎందరో దివ్యాంగులు అయిన క్రీడాకారులు ఆటల్లో రాణించేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుందని అన్నారు. ఒలంపిక్ పోటీల్లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు ఉద్యోగం ఇవ్వడం ఇదేమీ కొత్తకాదు. ఇప్పటికే చాలా ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చాయి. వీటితో పాటూ నగదు బహుమతులు కూడా ప్రకటించాయి.

రెండు ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటిన తెలుగింటి ఆడపడుచు పీవీ సింధూకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలక్టర్ గా ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. మహిళా బాక్సర్ మేరీకోమ్ కు కూడా ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటినందుకు గానూ.. పోలీసు శాఖలో ఉద్యోగం లభించింది. బాక్సర్ విజయేందర్ లాంటి వారు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం పొందారు. కానీ పారా ఒలంపియన్ అయిన మారియప్పన్ తంగవేల్ కు ప్రభుత్వ ఉద్యోగం రావడం నిజంగా  ఎంతో మంది దివ్యాంగులకు ప్రేరణ అని క్రీడానిపుణులు చెప్తున్నారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News