ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఢీ అంటే ఢీ అంటున్న వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వీరే!

Update: 2022-09-27 10:33 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175కి 175 సీట్లు సాధించాల‌ని వైఎస్సార్సీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టి నుంచే అభ్య‌ర్థుల ఎంపికపై ఆ పార్టీ దృష్టి సారించింది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ జిల్లాలవారీగా, నియోజ‌క‌వ‌ర్గాల‌వారీగా అభ్య‌ర్థుల‌తో వీలున్న‌ప్పుడల్లా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 28న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జుల‌తో స‌మీక్షించ‌నున్నారు.

ముఖ్యంగా ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ప‌దికి ప‌ది సీట్ల‌ను సాధించాల‌ని వైఎస్సార్సీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. అందులోనూ ఈ జిల్లా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డం విశేషం. 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం ప‌దికి ప‌ది స్థానాల‌ను వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. మ‌రోమారు ఇదే ఫీట్ రిపీట్ చేయాల‌ని భావిస్తోంది. అయితే త‌న ల‌క్ష్యంలో వైసీపీకి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త రెండు ప‌ర్యాయాలు అంటే 2014, 2019ల్లో వైఎస్సార్సీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. వైసీసీ త‌ర‌ఫున రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి రెండు ప‌ర్యాయాలు భారీ మెజారిటీతో నెగ్గారు. అయితే రాచ‌మ‌ల్లుకు సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి ఎదుర‌వుతోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ర‌మేష్ యాద‌వ్ కు ముఖ్య‌మంత్రికి స‌న్నిహితుడిగా పేరుంది. ర‌మేష్ యాద‌వ్ కూడా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌వారే.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రొద్దుటూరు నుంచి పోటీ చేసేది తానేనంటూ ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ త‌న అనుచ‌రుల‌కు చెప్పుకుని తిరుగుతున్నార‌ని అంటున్నారు. మ‌రోవైపు గ‌త రెండు ప‌ర్యాయాలు విజ‌యం సాధించిన తానే వ‌చ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తాన‌ని సిట్టింగ్ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి చెబుతున్నార‌ట‌.

కాగా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లుపై టీడీపీ నేత నందం సుబ్బ‌య్య‌ను హ‌త్య చేశార‌నే ఆరోప‌ణలున్నాయి. ఈ హ‌త్య‌తో త‌న‌కు సంబంధం లేద‌ని ఒక దేవాల‌యంలో రాచ‌మ‌ల్లు ప్ర‌మాణం చేశారు. అయితే మృతుడి కుటుంబ స‌భ్యులు మాత్రం ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డే చంపించార‌ని ఆరోపిస్తున్నారు. ఈ హ‌త్య రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే.

తాజాగా రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు 19వ వార్డు కౌన్సిల‌ర్ షేక్ మునీర్‌.. ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద‌రెడ్డి బావ‌మ‌రిది ప్ర‌ధాన అనుచ‌రుడు సుద‌ర్శ‌న్ రెడ్డి పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌న‌ను కూడా నందం సుబ్బ‌య్య‌లాగే చంపుతామ‌ని బెదిరిస్తున్నార‌ని స్వ‌యంగా సొంత పార్టీ కౌన్సిల‌రే ఫిర్యాదు చేయ‌డం ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లుకు ఇబ్బందిక‌రంగా మారింద‌ని అంటున్నారు. ఎమ్మెల్యే బావ‌మ‌రిది పాత‌కోట బంగారు మునిరెడ్డి ప్రోద్భ‌లంతోనే త‌న‌ను బెదిరిస్తున్నార‌ని షేక్ మునీర్ ఫిర్యాదు చేశాడు.

మ‌రోవైపు కౌన్సిల‌ర్ మునీర్ కు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వర్గీయులు కొత్తపల్లి సర్పంచి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి, మహ్మద్ గౌస్, ఎమ్మెల్సీ సోదరుడు వెంకటప్రసాద్, దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డి తదితరులు అండ‌గా నిల‌వ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీలోనే ఉన్న ఇద్ద‌రు నేతలు ఎమ్మెల్యే శివ‌ప్ర‌సాద‌రెడ్డి, ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ టికెట్‌ కోసం ఢీ అంటే ఢీ అంటున్నార‌ని చెబుతున్నారు.

కాగా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1989 నుంచి 2004 వ‌ర‌కు వ‌రుస‌గా ఐదుసార్లు వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలుపొందారు. 2009`ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న‌కు చుక్కెదురు అయ్యింది. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి మాత్రం అనూహ్యంగా ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు. 2009లో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిపై టీడీపీ అభ్య‌ర్థి మ‌ల్లెల లింగారెడ్డి గెలుపొందారు.

కాగా 2014, 2019 ఎన్నిక‌ల్లో ప్రొద్దుటూరు నుంచి వైసీపీ అభ్య‌ర్థి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో టీడీపీ మ‌ల్లెల లింగారెడ్డికి సీటు ఇచ్చింది. అయితే ఆయ‌న ఓడిపోయారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News