వివాదాల 'రాజా' సింగ్

Update: 2018-08-21 17:35 GMT
రాజాసింగ్. భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ్యునిగా గెలిచి ఆ పార్టీకే తలనొప్పులు తీసుకువస్తున్న శాసనసభ్యుడు. ఇది కొందరి అభిప్రాయం. అయితే తాను నమ్మిన సిద్దాంతాలకు - నమ్మకాలకు ప్రాణాన్ని సైతం పణంగా పెడతారని మరికొందరంటున్నారు. ఏది ఏమైనా ఆయన మాత్రం తాను అనుకున్నది సాధించే వరకూ తన పోరాటం ఆపేది లేదంటూ తేల్చేశారు. ఇంతకీ రాజా సింగ్ ఏమడిగారు. రాజాసింగ్ కు ఎవరి సంక్షేమం కావాలి. రాజాసింగ్‌ కు ఎవరి నమ్మకాలు కావాలి. ఏం లేదు. ఆయనకు కావాల్సింది హిందువులు దేవుడిగా ప్రార్ధించే - పూజించే గోవులను సంరక్షణ చేయాలి. అంటే గోవులను పూజించాలి. గోవులకు పూజలు చేయాలి. వాటిని చంపకూడదు. వాటిని తినకూడదు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో... ఎవరు చేయాలనుకుంటున్నారో వారిపై తాను పోరాడుతున్నానని రాజాసింగ్ ప్రకటించారు.

ఈ పోరాటానికి తన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. స్వతంత్రంగా ఓ ఉద్యమాన్ని చేపట్టారు. గో సంరక్షణ కోసం ఆయన చేపట్టిన ఈ ఉద్యమంలో తన సహచరులను అరెస్టు చేయడంపై ఆయన తెలంగాణ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఏకంగా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వం మజ్లీస్ పార్టీకి అనుకూలంగా ఉందంటూ రాజాసింగ్ తన ఆరోపణలను ఏకంగా ముఖ్యమంత్రి పైనే ఎక్కు పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇలా హఠత్తు ఉద్యమం చేయడం వెనుక ఆ పార్టీకి చెందిన పెద్దలున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇలా రాజాసింగ్ చేత ఉద్యమాలు చేయించి హిందువుల ఓట్లను కొల్లగొట్టాలన్నది భారతీయ జనతా పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది.  నెల రోజుల క్రితం హైదరాబాద్ లోక్‌ సభ స్ధానానికి రాజాసింగ్‌ ను భారతీయ జనతా
పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలపాలనుకుంటున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన చేపట్టిన ఉద్యమం ఈ అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి స్ధబ్దుగా ఉన్న జంట నగరాల రాజకీయాలు మాత్రం రాజాసింగ్ హడావుడితో మళ్లీ జోరందుకునేలా ఉన్నాయి. తమకు రాజకీయంగా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందనే భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు కూడా రాజాసింగ్‌ చర్యలను సమర్ధిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఎలాగైనా హైదరాబాద్ లోక్‌ సభ స్ధానాన్ని  కైవసం చేసుకోవాలని కలలు కంటున్న భారతీయ జనతా పార్టీ ఆ కలను రాజాసింగ్ ద్వారా నెరవేర్చుకోవాలని భావిస్తోంది. ఈ రాజకీయాలు ఎలా ఉన్నా రాజాసింగ్ వల్ల మాత్రం ఆవుల సంరక్షణ జరుగుతుందని హిందువులు భావిస్తున్నారు.



Tags:    

Similar News