త‌న‌ను త‌గుల‌బెట్టాల‌ని చూశారంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే

Update: 2022-06-28 07:35 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరును నిర్ణ‌యించ‌డంపై మే 24న అమ‌లాపురంలో విధ్వంసం, అల్ల‌ర్లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కోన‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేతృత్వంలో జ‌రిగిన ఆందోళ‌న‌లో నిర‌స‌న‌కారులు ప‌లు ప్రైవేటు, ప్ర‌భుత్వ ఆర్టీసీ బ‌స్సుల‌ను, పోలీసు వాహ‌నాల‌ను ద‌హ‌నం చేశారు. అంతేకాకుండా ర‌వాణా శాఖ మంత్రి పినిపె విశ్వ‌రూప్, ముమ్మిడివ‌రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ కుమార్ ఇళ్ల‌కు నిప్పు పెట్టారు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ కేసులో పోలీసులు 220 మందిని అరెస్టు చేశారు. కేసును త్వ‌ర‌గా ద‌ర్యాప్తు చేయ‌డానికి, పరారీలో ఉన్న నిందితుల‌ను అరెస్టు చేయ‌డానికి ప్ర‌త్యేక పోలీసుల బృందాల‌ను సైతం ఏర్పాటు చేశారు. అలాగే నిందితుల‌పై రౌడీషీట్లు తెర‌వ‌నున్నారు. జ‌రిగిన న‌ష్టానికి సంబంధించి నిర‌స‌న‌కారుల నుంచి న‌ష్ట‌ప‌రిహారాన్ని వ‌సూలు చేయ‌నున్నారు.

కాగా, తాజాగా ఈ ఘ‌ట‌న‌పై ముమ్మ‌డివ‌రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మే 24న విధ్వంసం జరిగిన రోజు ఆందోళ‌నకారులు త‌న‌ను, త‌న భార్య‌ను ఇంట్లోనే నిర్బంధించి త‌గుల‌బెట్టాల‌ని చూశార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసులు, త‌న అనుచ‌రులు సకాలంలో స్పందించ‌డంతో త్రుటిలో తాము బ‌య‌ట‌ప‌డ్డామ‌న్నారు. పోలీసులు, త‌న అనుచ‌రులు లేక‌పోతే తాను, త‌న భార్య సజీవ ద‌హ‌నమై ఉండేవాళ్ల‌మ‌ని చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న త‌ర్వాత రాజ‌కీయాల నుంచి పూర్తిగా విర‌మించుకోవాల‌ని అనుకున్నాన‌ని ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ చెబుతున్నారు. అయితే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా ఇచ్చార‌ని.. ధైర్యం చెప్పార‌ని అంటున్నారు.

ఆయ‌న ఇచ్చిన ధైర్యంతోనే రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నాన‌ని తెలిపారు. లేకుంటే రాజ‌కీయాల నుంచి వైదొల‌గేవాడినని అంటున్నారు. ఈ మేర‌కు అమ‌లాపురంలో మీడియాతో మాట్లాడుతూ పొన్నాడ స‌తీష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాగా అమ‌లాపురంలో విధ్వంసం, అల్ల‌ర్లు చోటు చేసుకుని జూన్ 24కు నెల రోజులు పూర్త‌య్యాయి. అయితే ఇప్ప‌టికి అక్క‌డ 144 సెక్ష‌న్, 30 సెక్ష‌న్ కొన‌సాగుతున్నాయి. ఇంట‌ర్నెట్ పై విధించిన నిషేధం కొద్దిరోజుల క్రితం ఎత్తేశారు. కాగా మ‌రోవైపు మే 18 నుంచి జూన్ 18 వ‌ర‌కు కోన‌సీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి ప్ర‌భుత్వం అభ్యంత‌రాలు స్వీక‌రించింది. దాదాపు 20 మండ‌లాల్లో ఆరు వేల మంది నుంచి అభ్యంత‌రాలు స్వీక‌రించారు. కొద్దిరోజుల క్రితం భేటీ అయిన ఏపీ కేబినెట్ కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరును పెడుతూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News