నిధుల కోసం కేసీఆర్ - కేటీఆర్ - హరీష్ చుట్టూ ఎమ్మెల్యేల ప్రదక్షిణ

Update: 2020-03-02 15:40 GMT
ఫిబ్రవరి 6వ తేదీ నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం గం.11కి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ పథకాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మంత్రి హరీష్ రావు 8న తొలిసారి బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ లో కొత్త పథకాలు - రాయితీలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఓ వైపు ఆర్థిక మందగమనం మరోవైపు జీఎస్టీ కలెక్షన్లు తగ్గి కేంద్రం నుండి నిధులు తగ్గాయి. ఈ నేపథ్యంలో తయారు చేస్తోన్న బడ్జెట్‌ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ఓ వైపు బడ్జెట్ తయారీ జరుగుతుండగా మరోవైపు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ - మంత్రులు కేటీఆర్ - హరీష్ రావుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తమ నియోజకవర్గాలకు కేటాయింపుల కోసం వారు ప్రదక్షిణ చేస్తున్నారు. తెరాస ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తమ తమ నియోజవర్గాల్లో వివిధ పనుల విషయమై నిలదీతలు ఎదురవుతున్నాయి.

దీంతో ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నిన్నటి వరకు వివిధ పనులు - సమస్యలపై ప్రజలు నిలదీసినప్పుడు ఆ ఎన్నికలని.. ఈ ఎన్నికలని చెప్పి తప్పించుకునే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రజలు నిలదీసినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొని - కేసీఆర్ - హరీష్ రావు - కేటీఆర్‌ లను కలుస్తున్నారు.

2018 డిసెంబర్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వరుసగా పార్లమెంటు - లోకల్ బాడీ ఎన్నికలు ఇలా ఏదో ఒకటి వచ్చాయి. దీంతో ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పుకోగలిగారు. ఇక ముందు జీహెచ్ ఎంసీ ఎన్నికలు మినహా ఏవీ లేవు. దీంతో గత ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన పనులకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందుకు ముగ్గురు నేతల వద్దకు వెళ్తున్నారు.

నియోజకవర్గాల్లోని పనులపై ప్రజల్లో అసంతృప్తి ఉందని - ఈ వ్యతిరేకత తీవ్రతరం కాకముందే నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. అయితే అభివృద్ధి పనులు ఫోకస్ పెడదామనుకున్న ప్రస్తుత సమయంలో ఆర్థిక మందగమనం - జీఎస్టీ కలెక్షన్లు తగ్గిన ప్రభావం ఉంటుంది. ఇది ఆందోళన కలిగిస్తోంది. రోడ్లు - డ్రైనేజీ - పారిశుద్ధ్యం - తాగునీరు వంటి వివిధ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్తున్నారు.

   

Tags:    

Similar News