ఎమ్మెల్సీకి షాకిచ్చిన స్వగ్రామం: మాట్లాడితే జరిమానా

Update: 2020-02-12 10:30 GMT
స్థానిక శాసనమండలి సభ్యుడు.. ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటి పదవి.. అలాంటి వ్యక్తి గ్రామంలోకి వస్తే ప్రజలు ఘన స్వాగతం పలుకుతారు.. అలాంటిది ఓ గ్రామం మాత్రం ఎమ్మెల్సీతో మాట్లాడొద్దని నిర్ణయించింది. ఒకవేళ ఎమ్మెల్సీతో మాట్లాడితే జరిమానా విధిస్తామని నిర్ణయించిన విచిత్ర సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎమ్మెల్సీతో నేరుగా మాట్లాడితే రూ.10 వేలు.. ఫోన్ లో మాట్లాడితే రూ.3 వేల జరిమానా విధించాలని గ్రామస్తులు కట్టుబాటు విధించారు.

ఆ వివరాలు.. నెల్లూరులోని కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో శివాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా మహోత్సవాలు చేశారు. ఈ గ్రామం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్వగ్రామం. అందుకే తొలిరోజు అంటే సోమవారం జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఇస్కపల్లిపాలేనికి చెందిన మత్స్యకారులూ తరలి రావడంతో వివాదం రేగింది. కాశీ విశ్వేశ్వర ఆలయ జీర్ణోదరణ, కుంబాభిషేకం సమయంలో విబేధాలు వచ్చాయి. ఆలయ పూజలకు సముద్ర జలాల కోసం వెళ్లిన సందర్భంలో వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వివాదాలపై ఎమ్మెల్సీ స్పందించారు. ‘ఇలాంటి దరిద్రపు ఊరు జిల్లాలో లేదు’.. అంటూ రవిచంద్ర తన స్వగ్రామం ఇస్కపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మత్స్యకార మహిళల వద్ద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ‘మేం దరిద్రపు వాళ్లమా, 30 ఏళ్లుగా మా గ్రామాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయంగా రాష్ట్రస్థాయికి ఎదిగి, మమ్మల్ని దూషిస్తావా’.. అంటూ మండిపడ్డారు. కలశాల్లో సముద్రపు నీరు ఇవ్వబోమని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని వారు హెచ్చరించారు. అనంతరం ఇస్కపల్లిపాలెంలో మత్స్యకారులంతా సమావేశమయ్యారు. బీద రవిచంద్ర తో మాట్లాడితే రూ.10,000, ఫోన్‌లో మాట్లాడితే రూ.3,000 జరిమానా చెల్లించాలని మత్స్యకారులు కట్టుబాటు పెట్టుకున్నారు.

అయితే ఈ విషయం సర్వత్రా చర్చానీయాంశం కావడంతో దీనిపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పందించారు. గ్రామంలో జరిగింది వేరు ప్రచారం లో ఉన్నది వేరు అని తెలిపారు. తాను గ్రామాన్ని ఇంత దరిద్రంగా ఉంచుకున్నారని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చుకున్నారు. గ్రామ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటం తో గ్రామ పెద్ద కాపుతో అలా అన్నానని చెప్పారు. ఆ వ్యాఖ్యలు గ్రామం గురించి కాదని స్పష్టం చేశారు.
Tags:    

Similar News