మరీ ఇంత డిమాండా? టోకెన్లు ఇచ్చి క్యూ లో పెట్టి మరీ నామినేషన్లు

Update: 2021-02-24 06:30 GMT
హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం నామినేషన్ల ఘట్టం ముగిసింది. అయితే.. ఈ సందర్భంగా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎప్పుడు లేనంత ఎక్కువగా ఈసారి నామినేషన్లు దాఖలు కావటం విశేషం. మంగళవారం నామినేషన్ల గడువు పూర్తి అయ్యే నాటికి 110 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారి నామినేషన్ల పెట్లు ఏకంగా 179 కావటం గమనార్హం.

నామినేషన్ల దాఖలుకు చివరి రోజున భారీగా అభ్యర్థులు రావటంతో.. వారికి టోకెన్లు ఇవ్వాల్సి వచ్చింది. క్యూలో పెట్టి.. ఒకరితర్వాత ఒకరి నామినేష్లను అధికారులు స్వీకరించారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని చెబుతున్నారు. మరోవైపు నల్గొండ.. వరంగల్.. ఖమ్మం స్థానానికి చివరి రోజున 28 మంది నామినేషన్లు వేశారు. దీంతో మొత్తం నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య 76కు చేరుకుంది.

హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు కావటంతో.. వీరిలో ఎంత మంది బరిలో ఉంటారు? ఎంత మంది పోటీ నుంచి తప్పుకుంటారన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ.. భారీగా బరిలో ఉంటే.. బ్యాలెట్ పత్రం ఏ సైజులు ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్న. అధికారుల చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. యాభైకి పైనే అభ్యర్థులు ఉంటే మాత్రం.. బ్యాలెట్ పత్రం బుక్ లెట్ మాదిరి ఇస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. ఓటు వేసే వారికి చిక్కులు తప్పవని చెబుతున్నారు. ఎందుకంటే.. తాము ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పేరును వెతికి.. ఓటు వేయటం ఒకింత ఆలస్యం కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. నామినేషన్ల ఉపసంహరణ వేళకు ఎంతమంది బరిలో ఉంటారో చూడాలి.
Tags:    

Similar News