కోర్టు కెక్కిన ధోనీ ప్ర‌చార ఒప్పంద‌ వివాదం!

Update: 2016-10-08 11:24 GMT
ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి ఉన్న పాపులారిటీ మామూలుది కాదు. అందుకే, వివిధ కంపెనీలు వెంట‌ప‌డి  - కోట్ల‌కు కోట్లు ఆఫ‌ర్ చేసి త‌మ‌ ఉత్ప‌త్తుల్ని ధోనీతో ప్ర‌చారం చేయించుకుంటాయి. అయితే, ఇలాంటి ఒక డీల్ విష‌యంలోనే కెప్టెన్ ధోనీ ఓ టెలీకాం కంపెనీపై మండిప‌డుతున్నాడు. త‌న‌కున్న పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు స‌ద‌రు కంపెనీ ప్ర‌య‌త్నిస్తోంద‌నీ, వారి వ్యాపారాభివృద్ధికి త‌న పేరును ఇష్టానుసారం వాడేసుకుంటోంద‌ని ఆరోపించాడు.  అయితే, ధోనీ కామెంట్ల ఆ టెలీకాం కంపెనీ కూడా స‌మాధానం ఇచ్చింది. మొత్తానికి ఈ వివాదం ఢిల్లీ హైకోర్టు వ‌ర‌కూ వ‌చ్చింది.

కెప్టెన్ ధోనీతో మ్యాక్స్ మొబీ లింక్స్ అనే టెలీకాం సంస్థ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ డీల్ 2012తోనే ముగిసిపోయింది. డీల్ ముగిసింది కాబ‌ట్టి, ఆ త‌రువాత ధోనీ పేరుతో ఆ కంపెనీ ప్ర‌చారం చేసుకోకూడ‌దు క‌దా! కానీ, ఒప్పంద కాలం ముగిసిన త‌రువాత కూడా స‌ద‌రు కంపెనీ త‌న పేరును వాడుకుంటూ వ్యాపారాలు చేసుకుంటోంద‌న్న‌ది ధోనీ వాద‌న‌. ఇప్ప‌టికీ త‌న పేరుతో ఉత్ప‌తుల్ని మార్కెట్ చేస్తోందంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించాడు కెప్టెన్ ధోనీ. ఈ ఆరోప‌ణ‌ల‌పై స‌ద‌రు కంపెనీ కూడా ప్ర‌తివాద‌న‌లు చేసింది.

తాము ఉద్దేశపూర్వ‌కంగా ఎక్క‌డా ధోనీ పేరును వాడ‌టం లేద‌ని ఆ సంస్థ కోర్టుకు చెప్పింది. ఒప్పందం ముగిసిన నాటి నుంచే ధోనీ పేరుతో ఎలాంటి ప్ర‌చారాలూ ఉత్ప‌త్తుల అమ్మ‌కాలూ చేయ‌డం లేద‌ని ఆ సంస్థ అధికారి అజ‌య్ అగ‌ర్వాల్ అన్నారు. ధోనీతో నాలుగేళ్ల కింద‌టే డీల్ ముగిసింద‌ని ఆయ‌న వాద‌న. ఈ విష‌యంలో కావాల‌నే కోర్టును ప‌క్క‌తోవ ప‌ట్టించేలా ధోనీ మాట్లాడుతున్నాడ‌ని ఆ సంస్థ ఆరోపించింది. అయితే, సంస్థ వాద‌న‌ల‌పై స్పందించేందుకు త‌మ‌కు కొంత స‌మ‌యం కావాల‌ని ధోనీ త‌ర‌ఫు న్యాయ‌వాది గ‌డువు కోర‌గా, కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 24కు వాయిదా వేసింది కోర్టు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News